ఐపీఎల్ 2023లో భాగంగా ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీకి గట్టి షాక్ తగిలింది. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతడిపై జరిమానా పడింది. ఐపీఎల్లో ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. ఈ మేరకు కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 నేరం కింద కోహ్లీ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అతడిపై ఎందుకు జరిమానా విధించార్నన విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇందుకు కారణమేంటా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే చెన్నై టీమ్ బ్యాట్స్‌మెన్ శివమ్ ధుబే ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. బహుశా అందుకే అతడికి జరిమానా విధించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
హర్షల్‌ను ఎందుకు ఆపారంటే..?
చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ చివరి ఓవర్ వేశాడు. అయితే, తొలి మూడు బంతులను మాత్రమే సంధించాక అతడ్ని ఆ తర్వాత బౌలింగ్‌కు అనుమతించలేదు. దానికి కారణం వరుసగా రెండు బీమర్లను సంధించడమే. బౌన్స్ లేకుండా నడుము కంటే ఎక్కువ ఎత్తులో బంతిని సంధిస్తే దానిని బీమర్‌గా పరిగణిస్తారు. అందుకే రెండు బీమర్లు వేస్తే ఆ ఓవర్‌ను కొనసాగించడానికి సదరు బౌలర్‌కు అంపైర్ అవకాశం ఇవ్వరు. చెన్నైతో మ్యాచ్‌లో హర్షల్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనూ ఇదే జరిగింది. దీంతో చివరి మూడు బంతులను వేసేందుకు మ్యాక్స్‌వెల్ రంగంలోకి దిగాడు. మూడు బంతుల్లో సిక్స్ సహా 9 పరుగులు ఇచ్చిన మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ కూడా పడగొట్టాడు.
ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాట్ చేతబట్టిన చెన్నై టీమ్ బ్యాటింగ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులను స్కోర్ చేసింది. ఈ క్రమంలో చెన్నై ఓపెనర్ డేవాన్ కాన్వే (83), శివమ్ ధుబే (52) మైదానంలో తమదైన శైలిలో విజృంభించారు. ఆ తర్వాత దిగిన బెంగళూరు జట్టు మాత్రం.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులను మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఆర్సీబీకి చెందిన డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (76) తమ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఓ కొలిక్కి తెచ్చినప్పటికీ వరుస వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమిపాలవ్వక తప్పలేదు.