RR dinesh karthik post: ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్ 15వ సీజన్‌లో బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తీక్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో స్టేడియం నలుమూలలా దంచికొడుతూ బెంగళూరుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకునే విషయంపై ప్రత్యర్థి జట్లు తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈరోజు సాయంత్రం రాజస్థాన్ పుణె వేదికగా బెంగళూరుతో తలపడనుంది. ఈ సందర్భంగా కార్తీక్‌ను అడ్డుకునేందుకు రాజస్థాన్ సోషల్ మీడియా టీమ్ ఓ ఉపాయం ఆలోచించింది.
అదేంటంటే.. ముంబయి-పుణె హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఉందని, అలాంటప్పుడు ఆ రూట్‌లో కాకుండా మరో షార్ట్‌కట్ రూట్‌లో దినేశ్ కార్తీక్ ముంబయి నుంచి పుణె చేరుకోవాలని ఓ రూట్ మ్యాప్‌కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసింది. దాంట్లో ముంబయి నుంచి దేశంలోని పలు ప్రాంతాలను చుట్టేస్తూ చివరికి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి రావాలని కోరింది. ఆ రూట్ మ్యాప్‌లో పలు రాష్ట్రాల చుట్టూ తిరిగి రావడం గమనార్హం. అంటే డీకేను మ్యాచ్‌కు ఆలస్యంగా రప్పిస్తే ఈరోజు తాము బెంగళూరును కట్టడి చేయొచ్చని రాజస్థాన్ సరదాగా పోస్టు చేసింది. దీనికి నెటిజన్లు, అభిమానుల నుంచి కూడా అదే రీతిలో స్పందన వచ్చింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ కూడా అలాగే రావాలంటూ ఓ అభిమాని చమత్కారంగా స్పందించాడు. మరికొందరు ఫన్నీ మీమ్స్‌తో అలరించారు. ఇంకొందరైతే దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చూసి రాజస్థాన్ భయపడుతోందని కూడా అంటున్నారు.
IPL kohli 2022: మరోవైపు, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ గర్జిస్తాడని ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఆ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకొంది. ఈ రోజు జరిగే మ్యాచ్ కోసం పవర్‌ఫుల్‌గా సన్నద్ధమవుతున్నాడు అని పోస్టు చేసింది. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ పైవిధంగా కామెంట్లు పెడుతున్నారు.
కింగ్ కోహ్లీ మళ్లీ చెలరేగుతాడని, ఎప్పటికీ అతడికి అండగా ఉంటామని అంటున్నారు. మరికొందరు ఈ రోజు మ్యాచ్‌లో కచ్చితంగా భారీ పరుగులు చేస్తాడని ఆశపడుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో విరాట్ బ్యాటింగ్ ప్రదర్శన అంతకంతకూ దిగజారిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 17 సగటుతో 119 పరుగులే చేశాడు. దీంతో ఈ రోజైనా కోహ్లీ రెచ్చిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో ఉంది. ఇక రాజస్థాన్ 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 ఓటములతో మూడో స్థానంలో దూసుకుపోతోంది
ఇదీ చదవండి: