"రాంచీలో ధోనీకి విలాసవంతమైన ఇల్లు ఉంది.. అతడి గ్యారేజ్‌లో ఖరీదైన బైక్‌లు, వాహనాలు కనిపిస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే ధోనీది 'రిచ్' లైఫ్.." ఈ మాటలన్నీ ఓ వ్యక్తి సక్సెస్ అయితే వినపడతాయి. కానీ వాటి వెనక ఆ వ్యక్తి కష్టం గురించి చాలా తక్కువ మందే మాట్లాడుకుంటారు. తనను తాను నమ్ముకుని, ఎన్నో ఒడిదొడుకలను ఎదుర్కొంటూ, ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిన ధోనీ జీవితం.. అందరికి ఓ పాఠం లాంటిది.
సాధారణ కుటుంబం నుంచి..
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని అతి సాధారణమైన కుటుంబంలో 1981 జులై 7న జన్మించాడు ధోని. తండ్రి పాన్ సింగ్ ఓ ప్రైవేటు సంస్థలో సాధారణ ఉద్యోగి. ధోనీకి ఓ సోదరి, ఓ సోదరుడు. మధ్య తరగతి కుటుంబంలో ఉండే కష్టాలే ధోనీ జీవితంలోను ఉండేవి.
ధోనీకి చిన్నప్పటి నుంచే క్రీడలపై ప్రేమ ఉండేది. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. మంచి గోల్‌కీపర్‌గా పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ సమయంలో అతడి ఫుట్‌బాల్ కోచ్.. ధోనీని క్రికెట్ మ్యాచ్ కోసం పంపించాడు. ఆ తర్వాత ధోనీ జీవితమే మారిపోయింది. క్రికెట్‌పై, ముఖ్యంగా వికెట్‌కీపింగ్‌పై ఎక్కువ దృష్టిసారించిన ధోనీ.. అంచెలంచెలుగా ఎదిగాడు. స్థానిక క్లబ్ నుంచి దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటాడు.
ఇదీ చూడండి:- 'ధోనీ.. ధోనీ.. ధోనీ'.. సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది!
2001-03 ధోనీ ఖరగ్‌పుర్ రైల్వే స్టేషన్లో టీటీగా ఉద్యోగం వచ్చింది. అటు ఆట, ఇటు ఉద్యోగం.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ధోనీ ప్రశంసలు అందుకున్నాడు.
తిరుగులేని ధోనీ..
ఒక్కసారి సెలక్టర్ల దృష్టిలో పడిన తర్వాత.. ధోనీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని దూసుకెళ్లాడు. మన దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించి చరిత్రలో నిలిచిపోయాడు. టీమ్ఇండియాలో అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపుపొందాడు.
రిటైర్మెంట్ తర్వాత కూడా ధోనీ క్రేజ్ తగ్గలేదు. మహేంద్రుడు ఏం చేసినా, ఎలాంటి దుస్తుల్లో దర్శనమిచ్చినా.. అదొక ట్రెండ్. కేవలం ధోని కోసమే ఐపీఎల్ చూసే వారూ చాలా మందే ఉన్నారు.
'కెప్టెన్ కూల్'కు ఎన్నో అవార్డులు దాసోహమయ్యాయి. ఖేల్ రత్న నుంచి పద్మశ్రీ వరకు అనేక పురస్కారాలతో ధోనీని సత్కరించింది భారత ప్రభుత్వం. రాంచీ హాకీ క్లబ్, ఫుట్‌బాల్‌లో చెన్నయన్ ఎఫ్‌సీ యజమానుల్లో ధోనీ ఒకడు. ఐపీఎల్ చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా ధోనీనే.
ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్ల ఆదాయంపై ఫోర్బ్స్ 2015లో ఓ నివేదికను బయటపెట్టింది. ఇందులో ధోనీకి 23వ స్థానం దక్కింది. అప్పుడే ధోనీ ఆదాయం 31 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ ప్రయాణంలో ధోనీ ఎక్కడైనా వెనకడుగు వేసి ఉంటే? తన వల్ల కాదని చేతులెత్తేసి ఉంటే? విమర్శలకు తలవంచి ఉంటే? టీమ్ఇండియా ఓ అమూల్యమైన 'నాయకుడిని' కోల్పోయేదన్నది మాత్రం కచ్చితం. కానీ మహేంద్ర సింగ్ ధోనీ అలా చేయలేదు. కష్టాలను ఎదురీది, అపజయాలకు ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి వేల కోట్లు గడించాడు. అన్నింటికి మించి.. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నాడు!
ఇవీ చూడండి:-