ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ సురక్షితమైన బయోబబుల్ ఏర్పాటు చేసిందని, తమ ఆటగాళ్లెవరూ ప్రమాదకరంగా భావించలేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్‌స్మిత్ అన్నాడు. ప్రస్తుత సీజన్ సగం గడిచేసరికి పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల కొద్దిరోజుల క్రితం మిగిలిన మ్యాచ్‌లను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తిరిగి తమ స్వదేశానికి చేరుకున్నారు.
'బయోబబుల్ పరిస్థితులను మేం ఏమాత్రం ప్రశ్నించం. మా ఆటగాళ్లతో మాట్లాడితే వాళ్లంతా క్షేమంగా ఉన్నామని చెప్పారు. భారత్‌లో ఏర్పాటు చేసిన బుడగ ఎంతో సురక్షితంగా అనిపించిందని చెప్పారు. ఎప్పడూ ప్రమాదమని భావించలేదన్నారు. అయితే, కొవిడ్-19 ఎలాంటి పరిస్థితులనైనా తీసుకురాగలదు. దేశంలో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడున్నా ప్రమాదకరమే. అది ఒకసారి బుడగలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం. అలాగే ఆటగాళ్లను తిరిగి స్వదేశాలకు చేర్చడంలో బీసీసీఐ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. దక్షిణాఫ్రికా ఇంకా భారత్ నుంచి రాకపోకలను నిషేధించని కారణంగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి' అని స్మిత్ చెప్పాడు.