క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే దేశంలో ఓ పక్క కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో లీగ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల్ని సజావుగా జరిపేందుకు 50 పేజీలతో కూడిన నిబంధనల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇదివరకే విడుదల చేసింది. బయోబబుల్‌లో ఉంటున్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
- ప్రాక్టీస్ సెషన్, మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వీక్షకుడు లేదా అభిమాని.. క్రికెటర్లకు దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తే సెక్యూరిటీ గార్డులు అతడిని అదుపులోకి తీసుకుంటారు. సదరు ఆటగాడు వెంటనే తన దుస్తులను మార్చుకోవాల్సి ఉంటుంది. (లీగ్ మధ్యలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తే)
- బయో బబుల్‌లో ఉన్న సహచర ఆటగాళ్లను కలిసే 20 సెకన్ల ముందు సదరు క్రికెటర్ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ఇతరులు ఎవరైనా క్రికెటర్ల కిట్ బ్యాగ్‌ను తాకినా సరే, దానిని శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.
- చేతులు శానిటైజ్ చేసుకున్న తర్వాతే సబ్‌స్టిట్యూట్, మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లాలి. ఆటగాళ్లు కూడా డ్రింక్స్ తాగడానికి ముందు, తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
- ప్రతి మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇరుజట్ల క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం, కలుసుకోవడం నిషిద్ధం. స్టేడియంలో స్నానాలు కూడా చేయకూడదు. యాంటీ డోపింగ్ అధికారులూ.. పీపీఈ కిట్లు ధరించి ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలి.
- వినోద కార్యకలాపాల్లో భాగంగా గోల్ఫ్ కోర్స్‌కు జట్టు సభ్యులు వెళ్లాలంటే సదరు ఫ్రాంచైజీ, బీసీసీఐ వైద్యుడి నుంచి కనీసం 24 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
- హోటల్ నుంచి గోల్ఫ్ కోర్స్‌కు వెళ్లడంలో భాగంగా క్రికెటర్లకు కేటాయించిన వాహనాలు ఎక్కడా ఆగకూడదు.
ఏప్రిల్ 9 నుంచి మొదలయ్యే ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్‌లు ముంబయి, చెన్నైలో జరుగుతాయి. ఆ తర్వాత దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. తొలి పోరు ముంబయి-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.
ఇదీ చూడండి: ఐపీఎల్‌ను వీడని కరోనా.. ఆర్సీబీ ఆటగాడికి పాజిటివ్