చూడగానే ఏంటీ ఇంత పొడువున్నారని అనిపించేలా? మ్యాచ్ సంబరాల సందర్భంగా సహచర ఆటగాళ్లు వీళ్ల చేతులు కొట్టాలంటే ఎగిరేలా.. ఐపీఎల్ ఆరంభ పోరులో ఇద్దరు భారీకాయులు ఆకట్టుకున్నారు. వాళ్లే జేమీసన్, మార్కో జాన్సెన్. వీళ్లిద్దరి ఎత్తు 6.8 అడుగులు కావడం విశేషం. అలాగే వీరిద్దరికీ ఐపీఎల్లో ఇదే తొలి మ్యాచ్.
రాయల్ ఛాలెంజర్స్ తరపున జేమీనన్, ముంబయి ఇండియన్స్ జట్టుతో జాన్సెన్ లీగ్లో అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరూ పేస్ ఆల్రౌండర్లు కావడం మరో విశేషం. ఇలా ఎత్తుతో పాటు ఆటలోనూ వీళ్ల మధ్య సారూప్యతలున్నాయి. మ్యాచ్లో ఆకారంలోనే కాకుండా ఆటతోనూ వీళ్లు సత్తా చాటారు.
ఈ ఏడాది వేలంలో రూ.15 కోట్ల భారీ ధర దక్కించుకున్న కివీస్ పేసర్ జేమీసన్ తన నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని దక్షిణాఫ్రికాకు చెందిన 20 ఏళ్ల పేస్ సంచలనం జాన్సెన్ (2/28) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఛేదనలో చివరి ఓవర్లో ఈ ముంబయి పేసర్ తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా బంతులేశాడు. ఇప్పటివరకూ ఐపీఎల్లో ఆడిన అత్యంత పొడుగైన ఆటగాడిగా ఉన్న బిల్లీ స్టాన్లేక్ (6.8 అడుగులు) సరసన వీళ్లూ చేరారు.