ఐపీఎల్‌లో ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఆ జట్టుకు కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు ఎంతమంది మారినా విజేతగా నిలవలేకపోతోంది. బ్యాటింగ్ విభాగంలో బలమైన హిట్టర్లున్నా ఏదో ఒక కారణంతో చతికిల పడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒంటి చేతి పోరాటం చేస్తున్నాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. గత మూడు సీజన్లలో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 14వ సీజన్‌లోనూ రాజస్థాన్‌పై 91 పరుగులతో చెలరేగి ఫామ్‌లో ఉన్నాననే సంకేతాలిచ్చాడు. దీంతో ఈసారైనా ఆ జట్టును విజేతగా నిలిపి కింగ్‌మేకర్‌గా నిలుస్తాడో లేదో చూడాలి. నేడు రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
ఆరంభం పేలవం..
2013లో ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్ తొలి మూడు సీజన్లలో ఆకట్టుకోలేకపోయాడు. 2013లో ఆర్సీబీ తరఫున 5 మ్యాచ్‌లాడి అత్యల్ప సగటు 10తో 20 పరుగులే చేశాడు. ఇక 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేయగా, అక్కడ రెండు సీజన్ల పాటు ఆడాడు. వరుసగా 166, 142 పరుగులు చేసి విఫలమవడంతో 2016లో మళ్లీ సొంతగూటి(బెంగళూరు)కి చేరాడు. ఈసారి 397 పరుగులతో ఫర్వాలేదనిపించి ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయితే, 2017లో గాయం కారణంగా ఆ సీజన్‌లో ఆడలేకపోయాడు.
దశ మారింది అక్కడే..
ఇక 2018లో పంజాబ్ కింగ్స్ రాహుల్‌ను రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడి నుంచే అతడి దశ తిరిగింది. జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దంచికొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ సీజన్‌లో మూడుసార్లు 90కి పైగా పరుగులు సాధించాడు. దాంతో టోర్నీ మొత్తంలో 659 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలోనే 2019లో తొలిసారి ఐపీఎల్‌లో సెంచరీ బాదాడు. అలాగే మరో ఆరు అర్ధశతకాలతో 593 పరుగులు చేశాడు. ఇక 2020 సీజన్‌కు ముందు అప్పటి కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ దిల్లీకి బదిలీ కాగా, రాహుల్ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2020లోనూ ఒక శతకం, ఐదు అర్ధశతకాలతో మొత్తం 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
గాయం నుంచి కోలుకొని..
2020 ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పంజాబ్ కెప్టెన్ అక్కడ వన్డేల్లో, టీ20ల్లో పలు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, టెస్టు సిరీస్ సమయంలో గాయపడడంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికై తొలుత టీ20ల్లో ఆడి విఫలమయ్యాడు. నాలుగు మ్యాచుల్లో కేవలం 15 పరుగులే చేసి రెండుసార్లు డకౌటయ్యాడు. అయితే, జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచి వన్డేల్లో చోటిచ్చింది. అక్కడ ఆడిన మూడు మ్యాచుల్లో ఒక అర్ధ శతకం, ఒక శతకం సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే 2021 ఐపీఎల్‌లో అడుగుపెట్టి రాజస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 91 పరుగులతో అదరగొట్టాడు. దాంతో ఈ సీజన్‌లోనూ తన పరుగుల వేట కొనసాగుతుందని చెప్పకనే చెప్పాడు. అయితే, రాహుల్ గతేడాది జట్టును బాగా నడిపించినా ఇతర జట్లు బలమైన పోటీ ఇవ్వడంతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరి ఈసారైనా జట్టును విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.
ఇదీ చదవండి:మ్యాచ్‌పై వార్నర్ అలా.. రోహిత్ శర్మ ఇలా