216.. ఐపీఎల్‌లో అప్పటి వరకు అత్యధిక చేధన ఇదే. దాన్ని సాధించడమే గొప్ప. అలాంటింది 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తారని ఎవరైనా అనుకుంటారా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రాజస్థాన్ రాయల్స్. అదీ మరో 3 బంతులు మిగిలుండగానే. గెలుపు ధీమాతో ఉన్న పంజాబ్‌ను మట్టికరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గెలుపోటములను పక్కన పెడితే ఆనాడు షార్జా సిక్సర్ల జడివానకు తడిచి ముద్దైంది. పరుగుల వరదకు సాక్ష్యంగా మారింది. అభిమానులను మైమరపించింది. ప్రస్తుత సీజన్లో ఆ రెండు జట్లు తలపడుతున్న నేపథ్యంలో 2020లో ఏం జరిగిందో 'రివైండ్' చేసుకుందామా?
సరికొత్త 'మయాంకం'
అప్పటివరకు అందరికీ తెలిసిన మయాంక్ వేరు. సంప్రదాయ ఆటగాడు.. మరీ వేగంగా పరుగులు చేయడనే పేరుంది. ఆనాటి ఉగ్రరూపం అతడిలో మరో కోణాన్ని చూపించింది. అతడిలో ఇంత దూకుడుందా? ఇంత వేగంగా ఆడతాడా? ఇలాంటి షాట్లు బాదేస్తాడా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు! 50 బంతుల్లో 106 పరుగులు చేశాడు. 7 సిక్సర్లు, 10 బౌండరీలు బాదేశాడు. జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్ వంటి పేసర్లకే చుక్కలు చూపించాడు.
అతడికి తోడుగా కేఎల్ రాహుల్ (69; 54 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకంతో రాణించాడు. ఆడింది 8 బంతులే అయినా 3 సిక్సర్లు, 1 బౌండరీతో 25 పరుగులు చేశాడు పూరన్. దాంతో 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది పంజాబ్.
అగ్నికి వాయువు తోడైనట్టు..
కష్టసాధ్యమైన ఛేదనకు దిగిన రాజస్థాన్ 2.2వ బంతికే బట్లర్ (4) వికెట్ కోల్పోయింది. కానీ, సునామీ అప్పుడే మొదలైంది! అగ్నికి వాయువు తోడైనట్టు స్టీవ్‌స్మిత్ (50; 27 బంతుల్లో 7×4, 2×6), సంజు శాంసన్ (85; 42 బంతుల్లో 4×4, 7×6) తోడయ్యాడు. స్టేడియంలో అభిమానులు లేరు కానీ.. ఉండుంటేనా? మోత మోగేదే! ఆకాశం బద్దలయ్యేదే! కాట్రెల్, షమి, నీషమ్.. ఎవ్వరొచ్చినా సిక్సర్లు బాదడమే పని. దాంతో రాజస్థాన్ 9 ఓవర్లకే 100/2 పరుగులు చేసేసింది. స్మిత్ ఔటైన తర్వాత పెద్దగా ఎవ్వరికీ తెలియని రాహుల్ తెవాతియాను క్రీజులోకి పంపించి పెద్ద తప్పిదమే చేసినట్టు కనిపించింది!
తె'వాహ్'తియా..!
10 ఓవర్లకు 104/2తో ఉన్న రాజస్థాన్ 15 ఓవర్లకు 140/2తో నిలిచింది. ఇంతలోనే 16వ ఓవర్లో 3 సిక్సర్లు బాదేసిన సంజును 16.1వ బంతికి షమి ఔట్ చేయడం వల్ల ఆ జట్టుకు షాక్ తగిలింది. రాబిన్ ఉతప్ప క్రీజులోకి వచ్చాడు. మరోవైపు 19 బంతులాడి 8 పరుగులే చేసిన రాహుల్ తెవాతియాపై గెలిపిస్తాడన్న నమ్మకమే లేదు. అందులోనూ అతడు ఒక్క బౌండరీ బాదలేదు. ఇక పంజాబ్ పట్టుబిగించినట్టే కనిపించింది.
కానీ, ఆడిన ఆఖరి 12 బంతుల్లో ఏకంగా 45 పరుగులు సాధించాడు తెవాతియా. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదేశాడు. 19వ ఓవర్లో మెలోడ్రామా నడిచింది. తొలి బంతికి ఉతప్ప ఔట్. రావడం రావడమే తర్వాతి రెండు బంతుల్ని ఆర్చర్ సిక్సర్లుగా మలిచాడు. ఐదో బంతిని స్టేడియం దాటించిన తెవాతియా చివరి బంతికి ఔటయ్యాడు. చివరికి ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ విజేతగా నిలిచింది.
మైమరపిస్తాయా?
ఐపీఎల్ 2021లో రాజస్థాన్, పంజాబ్ సోమవారం (ఏప్రిల్ 12) తలపడుతుండటం వల్ల అంచనాలు పెరిగాయి. సంజు శాంసన్ రాజస్థాన్ సారథిగా పదోన్నతి పొందాడు. ఇటువైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడతనిపై భారం తగ్గింది. డేవిడ్ మలన్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మయాంక్ అగర్వాల్, షారుఖ్ ఖాన్ ఉండటం వల్ల మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడతాడని బ్యాటింగ్ కోచ్ జాఫర్ ముందే చెప్పేశాడు.
మరోవైపు బౌలింగ్ విభాగాన్నీ పటిష్ఠం చేసుకుంది పంజాబ్ కింగ్స్. షమి, జోర్డాన్‌కు మెరీడిత్, రిచర్డ్‌సన్ అండగా ఉన్నారు. రాజస్థాన్ సైతం లివింగ్‌స్టన్, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్, శివమ్ దూబెను కొనుగోలు చేసింది. ఈ రెండు జట్లు గతేడాది తరహాలోనే అభిమానులను మురిపిస్తాయేమో చూడాలి!
ఇదీ చూడండి: ఐపీఎల్: రాజస్థాన్‌ను పంజాబ్ నిలువరిస్తుందా?