ఐపీఎల్ 14 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తన సోదరుడిని కోల్పోయాడు. దీన్ని నుంచి కోలుకోకముందే సకారియా తండ్రి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని భావ్నగర్‌లో చికిత్స పొందుతున్నారు. సకారియా ఆస్పత్రిలోనే ఉండి తన తండ్రికి చికిత్స విషయాన్ని చూసుకొంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో.. ఐపీఎల్ ఆడటం వల్ల వచ్చిన డబ్బు తన తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని సకారియా పేర్కొన్నాడు.
"ప్రజలు ఐపీఎల్‌ను ఆపాలంటున్నారు. నేను వారికి ఒకటి చెప్పదల్చుకున్నా. మా కుటుంబంలో సంపాదించే వ్యక్తిని నేనొక్కడినే. క్రికెటే నా జీవనాధారం. ఇంకా చెప్పాలంటే నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ నుంచి నా వాటా సొమ్మును అందుకున్నా. వెంటనే దాన్ని కుటుంబసభ్యులకు బదిలీ చేశా. ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్న నా కుటుంబానికి ఈ డబ్బు ఎంతగానో సహాయపడుతుంది."
-చేతన్ సకారియా, రాజస్థాన్ రాయల్స్ బౌలర్
"నా తండ్రికి మెరుగైన వైద్యం చేయిస్తున్నానంటే దానికి కారణం ఐపీఎల్ ఆడటం వల్ల సంపాదించిన డబ్బు. ఈ టోర్నమెంట్ ఒకవేళ నెల రోజులపాటు జరగకుంటే కఠిన పరిస్థితులను ఎదుర్కొనేవాడిని. చాలా పేద కుటుంబం నుంచి వచ్చా. నా తండ్రి టెంపో డ్రైవర్. రూ.కోటికి ఎన్ని సున్నాలుంటాయో కూడా నా తల్లికి తెలీదు. ఐపీఎల్ వల్లే మా జీవితాల్లో మార్పు వచ్చింది. నాన్న ఆరోగ్యవంతుడిగా మారిన తర్వాత ఇల్లు నిర్మించుకుంటాం. దాని కోసం ఐపీఎల్ జరగాలి" తెలిపాడు.
చేతన్ సకారియా.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. సౌరాష్ట్రకు చెందిన ఈ ఎడమచేతి వాటం పేసర్‌ని రాజస్థాన్.. 2021 ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాజస్థాన్ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. సకారియా తన మొదటి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తం మీద ఈ సీజన్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. అయితే, బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడుతుండటంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.