Yashasvi jaiswal ipl 2023 : ఐపీఎల్.. ఎంతో మంది టాలెంట్ ఉన్న యంగ్ క్రికెటర్లను వెలికితీసి.. టీమ్ఇండియాకు అందించింది. అలాగే ఫామ్ కోల్పోయిన సీనియర్ క్రికెటర్లు తామెంటో నిరూపించుకోవడానికి మంచి వేదికగా మారింది. అయితే తాజాగా ఈ మెగాటోర్నీ ద్వారా ఓ మాణిక్యం.. భారత జట్టుకు దొరికాడనే చెప్పాలి. అతని పేరే యశస్వి జైస్వాల్. అతడు కొంతకాలంగా ఐపీఎల్లో ఉంటునప్పటికీ.. ఈ సీజన్లో మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఈ తాజా ఎడిషన్‌లో ఈ రాజస్థాన్ ఓపెనర్ చెలరేగిపోతున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 428 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్ 10 మ్యాచుల్లో 258 పరుగులే చేసిన అతడు.. ఈ సీజన్లో ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? అని చెప్పారు యశస్వి కోచ్ జ్వాలా సింగ్.
సాధనలో భాగంగా అతడు ఎక్కువగా సిమెంట్ పిచ్‌లపై ప్లాస్టిక్ బంతులతో ఆడడం వల్ల.. బంతిని ఎక్కువగా మిడిల్ చేయగలుగుతున్నాడని జ్వాలా తెలిపారు. గంటల కొద్దీ నెట్స్‌లో చెమటోచ్చిన యశస్వి.. సిమెంట్ పిచ్‌లపై ప్లాస్టిక్ బంతులను ఎదుర్కోవడం వల్ల వేగంగా దూసుకొచ్చే బంతులను సమర్థంగా ఎదుర్కొగలుగుతున్నాడు. షార్ట్ బాల్స్‌ను సిక్స్‌లుగా బాదగలుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన ఎత్తును కూడా బాగా వినియోగించుకుంటున్నాడు.
"యశస్వికి ఐపీఎల్‌లో ఆడడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. టీ20ల్లో రాణించాలంటే మంచి టాలెంట్ ఉండాలి. భిన్నమైన నైపుణ్యాలు కావాలి. దీనికోసం జైస్వాల్‌ను గోరఖ్‌పుర్‌కు పిలిపించాను. సిమెంట్ పిచ్‌లపై వేగంగా దూసుకొచ్చే బంతులను బాగా ప్రాక్టీస్ చేశాడు. ఒక్కోసారి అంత వేగంగా దూసుకొచ్చే బాల్.. అతడి శరీరానికి తాకుతుంటే చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు చేసుకున్నాడు. రోజుకు 4-5 గంటల పాటు బాగా శిక్షణ చేశాడు. 80 మీటర్ల దూరాన్ని నిర్దేశించుకుని సిక్స్‌లు బాదేవాడు. ఈ కఠోర సాధనకు ఫలితమే ఇప్పుడు యశస్వి ఉన్న ఫామ్. అతడి జోరు చూస్తే భారత్ జట్టులో త్వరలోనే స్థానం సంపాదించుకుంటాడు అనిపిస్తోంది" అని జ్వాలాసింగ్ పేర్కొన్నాడు.
టెంట్లలో నిద్రపోయి.. పానీపూరి అమ్మి.. ఈ సీజన్లో సంచలనాలు సృష్టిస్తున్న యశస్వి జైస్వాల్.. ఒకప్పుడు పానీపురి కూడా అమ్మాడని ప్రచారం సాగింది. ముంబయిలో అతడు ఆజాద్ మైదానంలోని టెంట్లలో నిద్రపోయేవాడట. పొద్దున క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ సాయంత్రం పానీపురి కూడా అమ్మేవాడని కథనాలు వచ్చాయి. అలా ఓసారి కోచ్ జ్వాలాసింగ్ కళ్లలో పడగా... ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతో క్రికెట్లో ముందుకెళ్లాడని అంటుంటారు. అయితే దీనిపై జ్వాలా సింగ్ కాస్త ఘాటుగానే స్పందించారు. యశస్వి పానీపూరి అమ్మలేదని.. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. "అజాద్ మైదాన్‌లో ఎన్నో పానీ పురి స్టాల్స్ ఉండేవి. ఖాళీ సమయాల్లో అతడు అక్కడి వెళ్లి వారికి కాస్త హెల్ప్ చేసేవాడు. అతడికి సొంతంగా పానీ పూరి స్టాల్లేదు. ఎప్పుడు అమ్మలేదు. అలా అనడం కరెక్ట్ కాదు" అని పేర్కొన్నాడు.
ఇకపోతే యశస్వి.. 2019 అండర్-19 ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్లోనూ వన్డే డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా అతడి పేరు మీద రికార్డు ఉంది. 2020లో రాజస్థాన్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. గత మూడు సీజన్లలో అడపాదడపా ఆడిన అతడు.. ఈ సీజన్లో జట్టును తానే ముందుండి నడిపిస్తున్నాడు.
అతడిలో ఆ సత్తా ఉంది : యశస్వి జైస్వాల్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉందని.. స్థిరంగా రాణించగలిగితే.. అతడు కెరీర్లో మరింత ఎత్తుకు ఎదుగుతాడని రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార్ సంగక్కర అన్నాడు. "యశస్వికి ఎంతో టాలెంట్ ఉంది. ఆటను మెరుగుపరుచుకునేందుకు అతడు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఎక్కువగా సన్నద్ధతపైనే ఫోకస్ పెడతాడు. ముంబయిపై అతడు మంచిగా ఇన్నింగ్స్ ఆడాడు. పవర్‌ప్లే తర్వాత పరిస్థితికి తగ్గట్టుగా బాగా బ్యాటింగ్ చేశాడు. పేసర్లను ఎదుర్కొన్న విధానం కూడా చాలా బాగుంది. అతడు కెరీర్లో మరిన్ని సాధిస్తాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే సత్తా అతడిలో ఉంది. అతడు స్థిరంగా రాణిస్తూ ఉంటే చాలు. భారత జట్టు తలుపు తడుతుంది" అని సంగ అన్నాడు. \
ఇదీ చూడండి : Kohli vs Gambhir : విరాట్ రివేంజ్.. గంభీర్‌తో ఫైట్.. ఇద్దరికీ 100% ఫైన్!