IPL 2023 SRH vs LSG : సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తేలిపోయింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. పసలేని బౌలింగ్‌తో లఖ్‌నవూకు విజయం కట్టబెట్టింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో లఖనవూ ఛేదించింది. స్టోయినిస్(40), మన్కడ్(64*), పూరన్ (44*)ల బీభత్సం సృష్టించారు. మేయర్స్‌ను (2) ఫిలిప్ ఔట్ చేశాడు. తర్వాత దూకుడు పెంచిన డికాక్ (29)ను మయంక్ మార్కండే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత స్టోయినిస్‌తో కలిసి మన్కండ్ మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 16 ఓవర్లో అభిషేక్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో ఊపందుకున్న స్టోయినిస్‌ను ఔట్ చేశాడు. అప్పుడే వచ్చిన పూరన్ బాదిన మూడు భారీ సిక్సర్లతో ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అప్పటి వరకూ సన్‌రైజర్స్ గెలుపు మీద ఉన్న ఆశలపై పూరన్ నీళ్లు చల్లాడు. అంతే.. సమీకరణం 24 బంతుల్లో 38గా మారింది. తర్వాత క్రమం తప్పకుండా పూరన్ బౌండరీలు బాది లఖ్‌నవూకు విజయాన్ని చేరువచేశాడు. ఇక హైదరాబాద్ బౌలర్లలో ఫిలిప్స్, మార్కండే, అభిషేక్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో లఖ్‌నవూ ఆరోసారి విజయ పతాకం ఎగరేసింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అభిషేక్ నిరాశపర్చినా.. మరో ఓపెనర్ అన్మోల్ప్రీత్ 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తర్వాత వచ్చిన త్రిపాఠి 20, కెప్టెన్ మర్క్రమ్ 28 వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన క్లాసిన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు) చేశాడు. ఆఖర్లో, గత మ్యాచ్ హీరో అబ్దుల్ సమద్ ఏకంగా 4 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. లఖ్‌నవూ బౌలర్లలో కెప్టెన్ కృనాల్ రెండు, యుధ్వీర్, ఆవేశ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్ర తలో వికెట్ తీశారు.
మ్యాచ్ మధ్యలో రభస..
రెండో ఇన్నింగ్స్‌లో లఖ్‌నవూ బౌలర్ ఆవేశ్ ఖాన్ 19.5 బంతిని ఎత్తులో విసిరాడు. బ్యాటర్ క్లాసిన్ నో బాల్‌కు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దీంతో క్లాసిన్ రివ్యూ కోరాడు. రిప్లైలో కూడా బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నా.. థర్డ్ అంపైర్ బార్డే, ఫీల్డ్ అంపైర్ టోట్రే నిర్ణయాన్ని సమర్ధించి ఆ బంతిని లీగల్ డెలివరీగా ప్రకటించాడు. ఆశ్చర్యానికి గురైన క్లాసిన్ అంపైర్‌తో మాట్లాడుతుండగా.. లఖ్‌నవూ మెంటార్ గంభీర్, కోచ్ ఆండ్రీ బౌండరీ లైన్ లోపలికి వచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆరెంజ్ ఆర్మీ అభిమానులు లఖ్‌నవూ డగౌట్‌లోకి నట్, బౌల్ట్‌లు విసిరుతూ.. 'కోహ్లీ..కోహ్లీ' అంటూ నినాదాలు చేశారు.