IPL 2023 RCB vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో భీకర పోరు జరిగింది. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం గురువారం అభిమానులతో కిటకిటలాడింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఈ స్టేడియంలో ఇదే అఖరి మ్యాచ్. అంతేకాకుండా సన్‌రైజర్స్-బెంగళూరు జట్ల మధ్య పోరు కావడం మరో కారణం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ ఉండడం వల్ల అతడి అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియానికి వచ్చారు..
అర కిలోమీటరు దాటేందుకు 45 నిమిషాలు..
ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే ట్రాఫిక్.. మ్యాచ్ ప్రారంభం అయ్యేంత వరకు అంటే గురువారం రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5గంటల సమయంలో ఉప్పల్ రింగురోడ్డు నుంచి ఏక్ మినార్ మసీదు వరకు సుమారు అర కిలోమీటరు వరకు చేరేందుకు దాదాపు 45 నిమిషాలు పట్టింది. మండే ఎండకు తోడు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
టికెట్ ఉన్నా నిలబడే..
ఉప్పల్ స్టేడియంలోకి ప్రేక్షకుల ప్రవేశం గురువారం సాయంత్రం నుంచే మొదలైంది. మ్యాచ్ ప్రారంభానికి 30 నిమిషాల ముందే 28,649 మంది చేరుకున్నట్లు నమోదైంది. ఈ సంఖ్య రాత్రి 9.50 గంటలకు 39,862కు చేరింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక మంది ఈ మ్యాచ్‌కే రావడం గమనార్హం. టికెట్లు అమ్మిన, కాంప్లిమెంటరీగా ఇచ్చిన వారందరికీ సీట్లు కేటాయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కానీ టికెట్లు చేతిలో ఉన్నప్పటికీ సీట్లు లేకపోవడం వల్ల నిలబడిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. దీనికి కారణం చివరి మ్యాచ్ కావడం వల్ల ఎవరికి వారుగా అక్రమంగా నింపేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా పోలీసుల తీరుపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.
గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (104; 51 బంతుల్లో 8x4, 6x6) అదరగొట్టగా.. హ్యారీ బ్రూక్ (27; 2x4,1x6) ఫర్వాలేదనిపించాడు. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(63 బంతుల్లో 100; 12x4,4x6) సెంచరీ బాదాడు. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 71; 7x42x6) ధనాధన్ ఇన్సింగ్ ఆడాడు. ఇన్సింగ్ ఆఖర్లో వీరిద్దరూ ఔటైన బ్రాస్‌వెల్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.