ఐపీఎల్ 2023 సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్ మోసిన్ ఖాన్.. ఒక్క ఓవర్‌తో హీరోగా మారిపోయాడు. తాజాగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోసిన్.. చివరి ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని కాపాడి జట్టుకు విజయాన్ని అందించాడు. గాయం కారణంగా ఏడాది తర్వాత ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అతడు.. తన అద్భుత ప్రదర్శనతో సంచలనంగా మారాడు. ఈ సీజన్లో తన రెండో మ్యాచ్ ఆడుతున్న ఈ 24 ఏళ్ల ఈ యూపీ బౌలర్.. చివరి ఓవర్ ఒత్తిడిని అధిగమిస్తూ వేసిన బౌలింగ్ ప్రస్తుతం సెన్సేషనల్‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పది రోజులుగా తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అయినా ఆ బాధను దిగమింగుతూ చివరి ఓవర్‌ను విజయవంతంగా వేశానని మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యాడు మోసిన్.
"ఇది నాకు కష్టకాలం. గాయం కారణంగా ఏడాది తర్వాత క్రికెట్ ఆడుతున్నాను. మా నాన్న పది రోజుల పాటు ఐసీయూలో ఉండి నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. నేను ఆయన కోసమే ఈ విజయం సాధించాను. ఆయన నన్ను చూస్తున్నారని అనుకుంటున్నాను." అని మోసిన్ భావోద్వేగం చెందాడు. తనకు మద్దతుగా నిలిచిన జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. "జట్టు, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటాను. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సర్, విజయ్ దహియా సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.నేను గత మ్యాచ్‌లో సరిగా ఆడకపోయినా ఈ మ్యాచులో ఆడించారు" అని పేర్కొన్నాడు.
చివరి ఓవర్ ప్లాన్ ఇదే.. తన చివరి ఓవర్ ప్లాన్ గురించి కూడా వివరించాడు మోసిన్. "నేను ప్రాక్టీస్‌లో ఏం చేశానో దానిని అమలు చేయడమే నా ప్రణాళిక. నాతో కృనాల్ మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. రనప్ కూడా అదే. లాస్ట్ ఓవర్లో ఏం మార్చలేదు. ఎక్కువ టెన్షన్ పడకుండా, స్కోరుబోర్డు వైపు చూడకుండా.. ఆరు బంతులను బాగా వేశాను. వికెట్ నెమ్మదిగా ఉండటం వల్ల స్లోబాల్స్ వేయాలనుకున్నాను. కానీ రెండు బంతులను సంధించాక.. యార్కర్ ట్రై చేశాను. బాల్ రివర్స్ స్వింగ్ కూడా అయ్యింది" అని మోసిన్ ఖాన్ తెలిపాడు.
కాగా, చివరి ఓవర్లో ముంబయి గెలవాలంటే 11 పరుగులు అవసరం అయ్యాయి. టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ లాంటి హిట్టర్లు క్రీజులో ఉండటం వల్ల.. గెలుపు ముంబయిదే అని అంతా అనుకున్నారు. కానీ మోసిన్ ఖాన్ మాత్రం.. తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసి అద్భుత యార్కర్లతో చేలరేగాడు. కేవలం 5 పరుగులే ఇచ్చి లఖ్‌నవూకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో లఖ్‌నవూ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. మరో మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఇక రోహిత్ సేన 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇదీ చూడండి: LSG vs MI : మోసిన్ సూపర్.. ముంబయిపై లఖ్‌నవూ అనూహ్య విజయం