ఐపీఎల్ 16వ సీజన్‌లో యంగ్ క్రికెటర్ల హవా సాగుతోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, ఆయుశ్ బదోని, కర్ణ్ శర్మ, రాహుల్ తెవాతియా.. ఇలా యంగ్ ప్లేయర్లందరూ సత్తా చాటుతున్నారు. జాతీయ జట్టులో తలుపు తడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారంతా సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయితే రాజస్థాన్ రాయల్స్ డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోల్‌కత నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్.. ఈ సీజన్‌లో దుమ్ముదులుపుతున్నారు. మ్యాచ్- మ్యాచ్‌కు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒంటిచేత్తో తమ జట్లను గెలిపిస్తున్నారు.
IPL 2023 Yashasvi Jaiswal : ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఆడిన యశస్వి జైస్వాల్.. 575 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 166.18 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌తో స్టేడియంలో పరుగుల వరదను పారిస్తున్నాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. 2020లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన ఈ యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అతి తక్కువ సమయంలో 1,000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. 36 మ్యాచ్‌లల్లో 1,122 పరుగులు చేశాడు.
IPL 2023 Rinku Singh : ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ కూడా సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఈ కోల్‌కతా బ్యాటర్.. 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 143.31గా ఉంది.
యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ ఇదివరకే టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్, స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా నడిచాడు. యంగ్ ప్లేయర్లిద్దరినీ జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
జైస్వాల్, రింకును నేరుగా తుదిజట్టులోకి తీసుకోవాలని తాను చెప్పట్లేదని, సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం వారికి కల్పించడం వల్ల రాటుదేలుతారని అన్నాడు. సత్తా చాటుతున్న ప్లేయర్లు బీసీసీఐలో భాగం కావాలని తాను కోరుకుంటున్నానని, సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల వారు కచ్చితంగా కొత్త అంశాలను నేర్చుకుంటారని, తమ ఆటతీరును మరింత మెరుగుపర్చుకుంటారని అన్నాడు. రింకూ సింగ్, యశస్వి జైస్వాల్‌కు జాతీయ జట్టులోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియా కాంట్రాక్ట్ కుదుర్చుకునే ప్లేయర్ల సరసన వారిని చేర్చాల్సిన అవసరం ఉందని అన్నాడు.