ఐపీఎల్ 2023లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఏడు పరుగులు తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా రాహుల్ సేన ముందు ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో.. బౌలింగ్‌లో చివరి ఓవర్లలో చాకచక్యంగా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసింది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ను లఖ్‌నవూ చేజేతులారా పోగొట్టుకుంది. తక్కువ స్కోరే కదా ఈజీగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ.. గుజరాత్ బౌలర్ల ధాటికి లఖ్‌నవూ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. కేఎల్ రాహుల్(68; 61 బంతుల్లో 8x4) ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడి పోరాటం వృథా అయిపోయింది. కైల్ మేయర్స్ (24), కృనాల్ పాండ్య(3) రాణించిన ఫలితం దక్కలేదు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, మోహిత్ శర్మ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు.. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగుల నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47; 37 బంతుల్లో 6x4), కెప్టెన్ హార్దిక్ పాండ్య (66; 50 బంతుల్లో 2x4, 4x6) రాణించారు. ఇక శుభ్‌మన్ గిల్ డకౌట్ కాగా విజయ్ శంకర్ (10), అభినవ్ మనోహర్ (3), మిల్లర్ (6) విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్ పాండ్య, స్టాయినిస్ చెరో రెండు వికెట్లు తీశారు.. అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
కేఎల్ రాహుల్ రికార్డు.. ఇకపోతే ఈ మ్యాచ్‌తో ఓ మార్క్‌ను అందుకున్నాడు కేఎల్ రాహుల్. టీ20 కెరీర్‌లో 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. 210 మ్యాచ్‌ల్లో 42.42 సగటు, 6 శతకాలు, 66 అర్ధ శతకాల సాయంతో ఈ ఘనతను సాధించాడు. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో రాహుల్ కన్నా ముందు 40 మంది ప్లేయర్స్ టీ20ల్లో 7000 పరుగుల మార్క్‌ను అందుకున్నారు. వీరిలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (44.14) ఒక్కడే రాహుల్ కన్నా మెరుగైన సగటుతో ఉన్నాడు. మరో ఘనత కూడా సాధించాడు రాహుల్. ఓపెనర్‌గా 50 ప్లస్ స్కోర్లు ఎక్కువసార్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్ ఓపెనర్‌గా 34సార్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. అలా గౌతమ్ గంభీర్ .. 34 సార్లు 50 ప్లస్ స్కోర్లు రికార్డును అధిగమించాడు.
ఇదీ చూడండి: IPL 2023 : టెస్ట్ మ్యాచ్‌లా గుజరాత్ ఇన్నింగ్స్.. ఫ్లైయింగ్ కిస్‌తో కృనాల్ సెలబ్రేషన్స్