ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హోరా హోరీ మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన మజా లభిస్తోంది. టాప్ టీమ్స్ తడబడతుండగా.. అంచనాల్లేని చిన్న జట్లు అసాధారణ ప్రదర్శనతో చెలరేగుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచే జట్టు ఏదా? అనే చర్చ క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. ఒక్కో ప్లేయర్ ఒక్కో టీమ్ పేరు చెప్పారు. జట్టు బలాలు బలహీనతల ఆధారంగా వారు విజేతను అంచనా వేశారు. అయితే క్రికెట్‌లో బాగా నమ్మే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ చేరే జట్ల వివరాలను ప్రముఖ న్యూమరాలజిస్ట్ గౌతమ్ అజాద్ వెల్లడించారు.
గౌతమ్ అజాద్.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా నాలుగు టీమ్స్ పేర్లను చెప్పారు. బ్లూ కలర్ జెర్సీ కలిగిన జట్టునే టైటిల్ వరిస్తుందని స్పష్టం చేశారు. 2023 ఏడాదిలో అంకెలన్నీ కలిపితే వచ్చేది 7 అని, సంఖ్యా శాస్త్రంలో 7 నెంబర్ నీలం రంగును సూచిస్తోందని పేర్కొన్నారు. బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ మూడు జట్లతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుతుందన్నారు. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు టైటిల్ గెలిచే జట్టుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. కెప్టెన్‌ను మారిస్తే మాత్రం ఆ జట్ల విజయాలపై ప్రభావం ఉంటుందని, తన ప్రెడిక్షన్‌లో మార్పులు కూడా జరుగుతాయని తెలిపారు.
ఇక్కడ ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే.. ఆజాద్ చెప్పిన నాలుగు జట్లలో ఒక్క లఖ్‌నవూ మాత్రమే టాప్-3లో ఉంది. మిగతా మూడు జట్లలో దిల్లీ క్యాపిటల్స్ మూడు ఓటములతో చివరి స్థానంలో ఉండగా.. ముంబయి ఇండియన్స్ 2 ఓటములతో 9వ స్థానంలో నిలిచింది. ఒక్క విజయంతో ఆర్‌సీబీ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
లీగ్‌లో భాగంగా.. నేడు(సోమవారం) లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో లఖ్‌నవూ రెండు గెలిచి.. ఒకటి ఓడింది. మరోవైపు, బెంగళూరు జట్టు.. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. అందులో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గెలవగా.. కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.