ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో గత నాలుగు రోజులుగా రసవత్తరమైన మ్యాచులు జరుగుతున్నాయి. చివరి వరకు విజయం దోబూచులాడుతోంది. 20వ ఓవర్లోనే విజయం తేలుతుంది. బుధవారం సాయంత్రం.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠగా సాగింది. ఆఖరి వరకు ధోనీ పోరాడినా.. లాభం లేకుండా పోయింది. మూడు పరుగుల తేడాతోనే రాజస్థాన్ విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో చెన్నై సారథి ఎంఎస్ ధోనీ గాయంతోనే ఆడాడు. అయినా కీపింగ్, బ్యాటింగ్‌లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. ఇదే విషయాన్ని సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్వయంగా వెల్లడించాడు.
మోకాలి గాయంతోనే ధోనీ.. రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడాడని ఫ్లెమింగ్ తెలిపాడు. అయినా, అత్యుత్తమ ఆటతీరును కనబర్చాడని పేర్కొన్నాడు. వచ్చే మ్యాచుల్లోనూ ధోనీ ఆడతాడని, మోకాలి గాయం పెద్ద సమస్య కాదని ఫ్లెమింగ్ చెప్పాడు. "ఎంఎస్ ధోనీ మోకాలి గాయంతోనే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ సందర్భంగా కొన్నిసార్లు కాస్త ఇబ్బంది పడినా.. నాణ్యమైన ప్రదర్శనను ఇవ్వకుండా మాత్రం ఉండలేదు. అతడి ఫిట్‌నెస్ స్థాయి ప్రొఫెషనల్‌గా ఉంటుంది. టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే అతడు శిబిరానికి వచ్చాడు. అతడి ఆట తీరులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. చెన్నై ఆడే తదుపరి మ్యాచుల్లోనూ ధోనీ కచ్చితంగా ఆడి తీరుతాడు" అని ఫ్లెమింగ్ తెలిపాడు.
మగాల దూరం!
సొంత మైదానంలో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన చెన్నైకి మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో చెన్నై స్టార్ ప్లేయర్ సిసాండ మగాల గాయపడ్డాడు. దీంతో అతడు కనీసం రెండు వారాల పాటు ఆటకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక కష్టతరమైన క్యాచ్ పట్టే క్రమంలో అతడికి ఈ గాయమైంది. అప్పటికప్పుడే అతడు మైదానం వీడాల్సి వచ్చింది. ఈ గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. కనీసం రెండు వారాలు అతను ఆడటం కుదరదని తేల్చేశారు. దీంతో చెన్నైకి ఇది అతి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇప్పటికే గాయంతో బెన్ స్టోక్స్ ఆటకు దూరమైన నేపథ్యంలో చెన్నైకి ఇది మరింత పెద్ద సమస్యగా మారింది. మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసినా కూడా స్టోక్స్ అంతగా ఆడలేదు. చెన్నై ఆడిన తొలి రెండు మ్యాచుల్లో బరిలో దిగిన అతడు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మోకాలి గాయం మరింత నొప్పి చేయడంతో బెంచ్‌కే పరిమితం అయ్యాడు.