ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా గత నాలుగు మ్యాచులు కూడా ఎంతో ఉత్కంఠగా సాగాయి. తాజాగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయంలో కూడా అదే జరిగింది. థ్రిల్లింగ్ ముగింపును ఇస్తూ అభిమానులకు మస్త్ మజానిచ్చింది. ఆఖరి బంతి వరకు దోబూచులాడిన విజయం.. చివరికి సందీప్ శర్మ అద్భుతమైన బౌలింగ్ వల్ల 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌కే వరించింది. అలా తాజా సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన రాయల్స్ టీమ్.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది.
అయితే గెలుపు జోషల్‌లో ఉన్న రాజస్థాన్‌కు ఇప్పుడు ఓ ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు ఐపీఎల్ అధికారులు. రూ.12 లక్షలు ఫైన్ వేశారు. ఈ సీజన్‌లో రాయల్స్ చేసిన తొలి తప్పిదం కారణం కేవలం రూ.12 లక్షల రూపాయల జరిమానా మాత్రమే పడింది. రెండో సారి ఇదే తప్పు కొనసాగితే.. సంజూ ఒక్క మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. కాగా, తాజా సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత.. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన రెండో కెప్టెన్‌గా శాంసన్ నిలిచాడు. ఇకపోతే ఐపీఎల్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా శాంసన్‌కు ఫైన్ విధించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు కూడా గత సీజన్(2021)లో రెండు సార్లు అతడిపై జరిమానా విధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్థాన్ జట్టులో సంజూ శాంశన్ తన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ పరిచాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బట్లర్(52) హాఫ్ సెంచరీతో మెరవగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్మయర్(30), పర్వాలేదనిపించారు.
ఇక మ్యాచ్ ఫలితంగా గురించి సంజూ మాట్లాడుతూ.. "మా ప్లేయర్స్ అద్భుతంగా ఆడారు. క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది. ముఖ్యంగా మా బౌలర్లు చివరి వరకు ఎంతో ఓపికగా ఉన్నారు. వాస్తవానికి చెపాక్‌లో నాకు ఇప్పటిదాకా మధుర జ్ఞాపకాలంటూ ఏమీ లేవు. ఒక్కసారి కూడా మేము గెలవలేదు. ఇప్పుడది తీరిపోయింది. పక్కా ప్రణాళికలు వేసుకుని ఆడాం. కానీ ధోనీతో ఏదీ అంత ఈజీ కాదు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. అందుకే టీమ్‌తో కలిసి చాలా రీసెర్చ్ చేశాను. ఏదేమైనప్పటికీ ఈ రోజు మాది అయింది" అని శాంసన్ అన్నాడు.
ఇదీ చూడండి: ధోనీయా మజాకా.. మూడు సిక్స్‌లే.. కానీ ఆల్ టైమ్ రికార్డ్!