IPL 2023 MI VS RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తాజా సీజన్‌లో ముంబయి ఇండియన్స్ కీలక దశలో ముంబయి ఇండియన్స్ పుంజుకుంది. ఈ సీజన్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆరో విజయంతో ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్‌ను ఊచకోత కోసిన రోహిత్ సేన.. 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు సృష్టించింది. సూర్యకుమార్(83; 35 బంతుల్లో 7×4, 6×6) వీర విధ్వంసంతో బెంగళూరును మట్టికరిపించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో టాప్-4లో నిలవడం రోహిత్ సేనకు ఇదే తొలిసారి కావడం విశేషం. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది మూడో విజయం. ఇక రాయల్ ఛాలెంజర్స్ ఆరో ఓటమిని అందుకుని తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఆర్సీబీ బౌలింగ్‌ను ఊచకోత.. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబయి... ఆర్సీబీ బౌలింగ్‌ను ఊచకోత కోసింది. 42 పరుగులతో ఇషాన్ కిషన్ శుభారంభం ఇవ్వగా.. 35 బంతుల్లో 83 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. నేహాల్ వధేరా 52 పరుగులతో మెరుగు ఇన్నింగ్స్ ఆడాడు. వీరి విధ్యంసంతో 16.3 ఓవర్లలోనే ముంబయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో మరో 3 ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు బౌలర్లు హసరంగా, విజయ్‌కుమార్ తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ కోహ్లీ పేలవ ప్రదర్శన చేశాడు. కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ (65; 41 బంతుల్లో 5×4, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన అనూజ్ (6) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. అనంతరం రంగంలోకి దిగిన మ్యాక్స్‌వెల్ (68; 33 బంతుల్లో 8×4, 4×6) అదరగొట్టాడు. లామ్రోర్ (1) కూడా విరాట్ కోహ్లీనే అనుసరించాడు. దినేశ్ కార్తీక్ (30) ఫర్వాలేదనిపించగా.. కేదార్ జాదవ్ (12), హసరంగ (12) పరుగులు చేశారు. ఇక ముంబయి బౌలర్లలో బెరెన్‌డార్ఫ్ (3/36) బంతితో రాణించాడు. గ్రీన్, జోర్డాన్, కార్తికేయ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఇదీ చూడండి: IPL Cheerleaders Salary : ఐపీఎల్లో ఛీర్‌లీడర్స్ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా?