IPL 2022 RCB VS KKR: ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన కోల్‌కతా.. తమ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
తొలి విజయంపై కన్ను: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. పంజాబ్‌తో మ్యాచ్‌లో 57 బంతుల్లో 88 పరుగులు చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ కూడా ఆకట్టుకున్నాడు. ఓపెనర్ అనూజ్ రావత్ శుభారంభాన్ని అందించకున్నా.. కీపర్ దినేశ్ కార్తీక్ చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నలుగురు బ్యాటర్లు చేలరేగితే.. కోల్‌కతాకు కష్టమే.
అయితే గత మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ నిరాశపరిచారు. కోల్‌కతాను అడ్డుకోవాలంటే వారు రాణించాల్సిన అవసరం ఉంది.
జోరు కోనసాగించాలని: చెన్నైపై విజయం సాధించిన కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. అజింక్యా రహానె ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు శుభ పరిణామం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, జాక్సన్.. మిడిల్ ఆర్డర్ బాధ్యతల్ని స్వీకరించాలి. బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసినా.. శివం మావి, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ గత మ్యాచ్‌లో నిరాశపరిచారు. ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడనడంలో సందేహం లేదు.
హెడ్ టు హెడ్: ఇప్పటివరకు కోల్‌కతా, బెంగళూరు జట్లు 29 సార్లు తలపడ్డాయి. అందులో కోల్‌కతా.. 16 మ్యాచుల్లో గెలవగా.. బెంగళూరు 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
ఇదీ చదవండి: IPL 2022: సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ ఘన విజయం