ఈ సీజన్లో అద్భత ప్రదర్శనతో దూసుకెళ్తున్న తమ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో అతడొకడని కితాబిచ్చాడు. గాయంతో బాధపడిన జడ్డూ.. ఈ సీజన్లో ఆడటానికి వచ్చినప్పుడు అతడి ప్రదర్శనపై చాలామంది అనుమానాలు వ్యక్తపరిచారు. వాటిని పటాపంచలు చేస్తూ జడేజా బాగాఆడుతూ అందరి మన్నలను పొందుతున్నాడు.
"మా జట్టు(మిడిలార్డర్)లో జడ్డూ కీలకమైన ఆటగాడు. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. గత మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శనే నిదర్శనం. అతడిని నుంచి అంతకంటే మంచి ప్రదర్శనను మనం ఆశించనక్కర్లేదు. బాగా కష్టపడుతున్నాడు. ఏ ఫార్మాట్లోనైనా ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లలో అతడు ఒకడు. అతనుండటం మా అదృష్టం. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్, డుప్లెసిస్ కూడా అద్భుతంగా ఆడారు"
-స్టీఫెన్ ఫ్లెమింగ్, సీఎస్కే కోచ్
గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(75), డుప్లెసిస్(56) దంచికొట్టారు. ఆది నుంచీ వీరిద్దరు ఎదురుదాడి చేయడం వల్ల సన్‌రైజర్స్ బౌలర్లు తేలిపోయారు.
"రుతురాజ్‌తో నా ఓపెనింగ్ భాగస్వామ్యం చక్కగా కుదురుతోంది. మంచి ఆరంభాలు వచ్చినప్పుడు ఇన్నింగ్స్ అంతా సౌకర్యవంతంగా ఆడొచ్చు. గత సీజన్ నుంచి పాఠాలు నేర్చుకుని మేం కొన్ని మార్పులు చేసుకున్నాం. మా బ్యాటింగ్ లైనప్ బాగుంది. జడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. సూపర్‌మ్యాన్‌లా క్యాచ్‌లు పడుతున్నాడు" అని డుప్లెసిస్ అన్నాడు.
సీఎస్కే ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చూడండి.. మా ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడుతున్నారు: ధోనీ