దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (48), శిఖర్ ధావన్ (43) రాణించారు. చివర్లో హెట్‌మయర్ (29) కాస్త ధాటిగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (18) ఫర్వాలేదనిపించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. నిలకడగా పరుగులు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. దీంతో 10 ఓవర్లకు 88/0తో నిలిచింది. హర్షల్ పటేల్ వేసిన 10.1 బంతికి ధావన్.. క్రిస్టియన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చాహల్ వేసిన తర్వాతి ఓవర్లోనే పృథ్వీ షా కూడా పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
మరోవైపు క్రిస్టియన్ వేసిన 15వ ఓవర్లో హెట్‌మయర్ ఫోర్, సిక్స్ బాదాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఒక ఫోర్ బాదడం వల్ల ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. సిరాజ్ వేసిన 17.4 బంతికి అయ్యర్ ఔటయ్యాడు. సిరాజ్ వేసిన చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి హెట్‌మయర్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు, చాహల్, హర్షల్ పటేల్, డేనియల్ క్రిస్టియాన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి.. IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు