ఐపీఎల్లో తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్. అహ్మదాబాద్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును మోర్గాన్ సేన ఓడించింది. అయితే ఈ గెలుపులో తమ బౌలర్లదే కీలకపాత్ర అని అంటున్నాడు కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. పంజాబ్ జట్టుపై ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
"కోల్‌కతా జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. మేము చాలా కష్టపడ్డాం. టోర్నీ ప్రారంభంలో అనుకున్నంత ప్రదర్శన చేయకపోయినా.. పంజాబ్ జట్టుపై మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా మా బౌలర్లు ఈ విజయంలో కీలకంగా మారారు".
- ఇయాన్ మోర్గాన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్
"ప్రస్తుత సీజన్లో శివమ్ మావి రెండు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. అతడు గేల్ వికెట్ పడగొట్టడం వల్ల మ్యాచ్ గమనమే మారిపోయింది. మావికే ఆ క్రెడిట్ దక్కుతుంది. బౌలింగ్ లైనప్‌లో ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు స్పిన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. టోర్నీలో టేబుల్ టాప్కు రావడానికి ఇంకా అవకాశం ఉంది" అని ఇయాన్ మోర్గాన్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట కోల్‌కతా బౌలర్ల ధాటికి పంజాబ్ 9 వికెట్లకు 123 పరుగులే చేయగలిగింది. మయాంక్ (31; 34 బంతుల్లో 1×4, 2×6) టాప్ స్కోరర్. చివర్లో జోర్డాన్ (30; 18 బంతుల్లో 1×4, 3×6) బ్యాట్ ఝుళిపించాడు. ప్రసిద్ధ్ కృష్ణ (3/30), నరైన్ (2/22), కమిన్స్ (2/31) ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఛేదనలో కోల్‌కతా ఇబ్బంది పడ్డా.. మోర్గాన్ (47 నాటౌట్; 40 బంతుల్లో 4×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్ త్రిపాఠి (41; 32 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్లో గురువారం జరగనున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.
ఇదీ చూడండి.. ఐపీఎల్: క్రికెటర్లు కావలెను.. ఆ ఫ్రాంఛైజీ ప్రకటన