ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకెళ్లింది.
రాజస్థాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి శుభారంభం లభించింది. ఓపెనర్లు కోహ్లీ (25), పడిక్కల్ (22) మొదటి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అనంతరం పడిక్కల్‌ను ముస్తాఫిజుర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. కోహ్లీ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. తర్వాత భరత్, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. చూడచక్కని షాట్లతో అలరించిన భరత్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం బాదిన మ్యాక్స్‌వెల్(50*) జట్టుకు విజయాన్నందించాడు.
ఆరంభం అదిరినా..!
టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్(RR vs RCB 2021)కు అదిరిపోయే శుభారంభం లభించింది. ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్.. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడిగి దిగారు. లూయిస్ ఎడాపెడా బౌండరీలు బాదగా.. జైస్వాల్ అతడికి మద్దతుగా నిలిచాడు. దీంతో తొలి పవర్‌ప్లేలోనే 56 పరుగులు సాధించింది రాజస్థాన్. ఇన్నింగ్స్ ఇలా జోరుగా సాగుతున్న క్రమంలో వీరి 77 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు క్రిస్టియన్. జైస్వాల్ (3)ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి అర్ధసంచరీ పూర్తి చేసుకున్న లూయిస్ (58)ను పెవిలియన్ చేర్చాడు గార్టన్.తర్వాత వచ్చిన శాంసన్ (19), మహిపాల్ (3), తెవాటియా (2), లివింగ్‌స్టోన్ (6) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. చివర్లో మోరిస్ (14) కాసేపు పోరాడినా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పరుగులు రావడం కష్టమైంది. దీంతో చివరికి 9 వికెట్ల నష్టానికి 149 పరుగులతో సరిపెట్టుకుంది రాజస్థాన్.
బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లతో సత్తాచాటగా.. చాహల్ 2, షాబాద్ అహ్మద్ 2, క్రిస్టియన్, గార్టాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.