ఐపీఎల్-14(IPL 2021) రెండో అంచెలో చెన్నై(CSK vs MI) శుభారంభం చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్; 58 బంతుల్లో 9×4, 4×6) మెరవడం వల్ల(Ruturaj Gaikwad IPL Innings) ఆదివారం 20 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. జడేజా(26; 33 బంతుల్లో 1×4), డ్వేన్ బ్రావో (23; 8 బంతుల్లో 3×6) సహకారంతో రుతురాజ్ పోరాడడం వల్ల మొదట చెన్నై 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 8 వికెట్లకు 136 పరుగులే చేయగలిగింది. బ్రావో (3/25), దీపక్ చాహర్ (2/19) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు కళ్లెం వేశారు. సౌరభ్ తివారి(50 నాటౌట్; 40 బంతుల్లో 5×4) పోరాడినా ఫలితం లేకపోయింది.
ముంబయి తడబాటు
పెద్దదేమీ కానీ లక్ష్యాన్ని ధాటిగానే ఆరంభించిన ముంబయి(MI Innings Today).. కాసేపట్లోనే గాడితప్పింది. మూడో ఓవర్లో డికాక్(17) వికెట్‌ను దీపక్ చాహర్ పడగొట్టడం వల్ల ముంబయి పతనం ఆరంభమైంది. చాహర్ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ అన్మోల్(16)ను కూడా వెనక్కి పంపాడు. ప్రమాదకర సూర్యకుమార్(3)ను శార్దూల్‌ను ఎక్కువసేపు నిలవనివ్వలేదు. పదో ఓవర్లో ఇషాన్ కిషన్ (11)ను బ్రావో ఔట్ చేయడం వల్ల ముంబయి 58/4తో(10 ఓవర్లకు) నిలిచింది. పొలార్డ్ (15), సౌరభ్ తివారి కాసేపు పతనాన్ని ఆపారు. 13 ఓవర్లకు స్కోరు 87/4. సాధించాల్సిన రన్‌రేట్ పదికి చేరుకున్నా.. పొలార్డ్ క్రీజులో ఉండడం వల్ల ముంబయి ఆశలతోనే ఉంది.
కానీ హేజిల్‌వుడ్.. అతణ్ని ఔట్ చేయడం ద్వారా ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. తర్వాతి ఓవర్లోనే కృనాల్ (4) రనౌట్ కావడం.. ముంబయి పనైపోయినట్లే అనిపించింది. కానీ మిల్నె (15) తోడుగా పోరాడిన సౌరభ్ తివారి కాస్త ఆసక్తిని పెంచాడు. చివరి రెండు ఓవర్లలో ముంబయి 39 పరుగులు చేయాల్సివుండగా 19వ ఓవర్లో శార్దూల్ పేలవంగా బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చాడు. అయితే చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బ్రావో.. కేవలం మూడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం వల్ల చెన్నై విజయాన్నందుకుంది.
రుతురాజ్ ఒక్కడు..
24/4. ఆరు ఓవర్లకు చెన్నై అవస్థ ఇది. నిజానికిది 24/5 అనుకోవచ్చు. ఎందుకంటే రాయుడు గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముంబయి పేస్‌కు అంతగా బెంబేలెత్తిపోయిన చెన్నై.. 156/6తో ముగిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆద్యంతం క్రీజులో నిలిచిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. చక్కని బ్యాటింగ్‌తో ఆ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపిరిలూదాడు. చెన్నైకి ఆరంభమే పెద్ద షాక్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు ముంబయి పేస్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయింది. 3 ఓవర్లలో 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ అయిదో బంతికే డుప్లెసిస్ (0)ను బౌల్ట్ ఔట్ చేయగా.. రెండో ఓవర్లో అలీని(0) మిల్నె వెనక్కి పంపాడు. ఆ ఓవర్లోనే రాయుడు(0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం చెన్నైకి పెద్ద దెబ్బ. రైనా, ధోనీ కూడా క్రీజులో నిలవలేకపోవడం వల్ల చెన్నై 24/4తో కష్టాల్లోకి కూరుకుపోయింది. కానీ రుతురాజ్ తన పోరాటంతో ఆ జట్టును ఆదుకున్నాడు. చక్కని షాట్లతో అలరించాడు. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. మంచి సహకారాన్నిచ్చిన జడేజా(26; 33 బంతుల్లో 1×4)తో అయిదో వికెట్‌కు 81 పరుగులు జోడించిన అతడు.. ఆ తర్వాత ఆఖర్లో బ్రావో (23; 8 బంతుల్లో 3×6)తో కలిసి (ఆరో వికెట్‌కు 39) ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో చెన్నై స్కోరు 150 దాటింది.
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ నాటౌట్ 88; డుప్లెసిస్ (సి) మిల్నె (బి) బౌల్ట్ 0; మొయిన్ అలీ (సి) తివారి (బి) మిల్నె 0; రాయుడు రిటైర్డ్‌హర్ట్ 0; రైనా (సి) రాహుల్ చాహర్ (బి) బౌల్ట్ 4; ధోని (సి) బౌల్ట్ (బి) మిల్నె 3; జడేజా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 26; బ్రావో (సి) కృనాల్ (బి) బుమ్రా 23; శార్దూల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156; వికెట్ల పతనం: 1-1, 2-2, 3-7, 4-24, 5-105, 6-144; బౌలింగ్: బౌల్ట్ 4-1-35-2; మిల్నె 4-0-21-2; బుమ్రా 4-0-33-2; పొలార్డ్ 2-0-15-0; రాహుల్ చాహర్ 4-0-22-0; కృనాల్ పాండ్య 2-0-27-0.
ముంబయి ఇన్నింగ్స్: డికాక్ ఎల్బీ (బి) దీపక్ చాహర్ 17; అన్మోల్‌ప్రీత్ (బి) దీపక్ చాహర్ 16; సూర్యకుమార్ (సి) డుప్లెసిస్ (బి) శార్దూల్ 3; ఇషాన్ కిషన్ (సి) రైనా (బి) బ్రావో 11; సౌరభ్ తివారి నాటౌట్ 50; పొలార్డ్ ఎల్బీ (బి) హేజిల్‌వుడ్ 15; కృనాల్ రనౌట్ 4; మిల్నె (సి) గౌతమ్ (బి) బ్రావో 15; రాహుల్ చాహర్ (సి) రైనా (బి) బ్రావో 0; బుమ్రా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136; వికెట్ల పతనం: 1-18, 2-35, 3-37, 4-58, 5-87, 6-94, 7-134, 8-135; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-19-2; హేజిల్‌వుడ్ 4-0-34-1; శార్దూల్ ఠాకూర్ 4-0-29-1; మొయిన్ అలీ 3-0-16-0; డ్వేన్ బ్రావో 4-0-25-3; జడేజా 1-0-13-0.
ఇదీ చూడండి.. Ml vs CSK: ప్రతీకారం తీర్చుకున్న సీఎస్కే.. ముంబయిపై విజయం