బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో వచ్చినా పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా తనకుందని పంజాబ్ కింగ్స్ ఆటగాడు షారుక్ ఖాన్ అన్నాడు. ప్రస్తుతం అందరూ తనను ఫినిషర్‌గా గుర్తిస్తున్నారని చెప్పాడు. తమిళనాడుకు కొన్నేళ్లు టాప్ ఆర్డర్‌లో ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో షారుక్ 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆదిలోనే కీలకవికెట్లు కోల్పోయినా జట్టు స్కోర్ 100 దాటించాడు.
"బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన వెళ్లి మ్యాచులు ముగించే బాధ్యత నాకు అప్పగించారు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ దంచికొట్టలేం. కొన్నిసార్లు జట్టు త్వరగా వికెట్లు చేజార్చుకోవచ్చు. అప్పుడు ఆఖరి వరకు ఆడాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఫినిషర్‌గా నన్ను గుర్తించినా నేనో మంచి బ్యాట్స్‌మన్‌ని. తమిళనాడుకు టాప్ ఆర్డర్‌లో ఆడాను. అన్ని పరిస్థితుల్లోనూ రాణించగలను."
-షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్
అంతర్జాతీయ స్టార్ల మధ్య గడపటం.. నేర్చుకొనేందుకు ఎంతో ఉపయోగపడుతుందని షారుక్ చెప్పాడు. "నికోలస్ పూరన్, క్రిస్‌గేల్, డేవిడ్ మలన్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు నాతో మాట్లాడుతున్నారు. నెట్స్‌లో గమనించిన విషయాలు పంచుకుంటున్నారు. ఐపీఎల్‌కు నేను కొత్త. అందుకే నన్ను నేను మెరుగుపరచుకునేందుకు వారి సలహాలు ఉపయోగపడతాయి. వారి నుంచి ఇంకెంతో నేర్చుకొని మైదానంలో అమలు చేయాలి" అని ఈ యువ హిట్టర్ అంటున్నాడు.