దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించింది. చెన్నైని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ నేపథ్యంలో పంత్ తనకు స్ఫూర్తిగా నిలిచిన ధోనీపైనే పైచేయి సాధించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు.
"189 పరుగుల ఛేదనలో ధావన్, పృథ్వీషాలు అర్ధసెంచరీలతో కదంతొక్కి అద్భుతంగా ఆడారు. టాస్‌కి ధోనీతో కలిసి వెళ్లడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక బౌలింగ్‌లో క్రిస్ వోక్స్, ఆవేశ్ ఖాన్‌లు చక్కటి ప్రదర్శన చేశారు. నోర్ట్జే, రబాడల గైర్హాజరీలో కూడా చక్కగా బౌలింగ్ చేశారు. నాకు స్ఫూర్తిగా నిలిచిన ధోనీపైనే పైచేయి సాధించడం సంతోషంగా ఉంది."
-పంత్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
మా ఆలోచనలు బెడిసికొట్టాయి : ధోనీ
"మా బౌలింగ్ ఆలోచనలు బెడిసికొట్టాయి. ఇక ముందు మ్యాచుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం. టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాత్రి పూట మంచు ప్రభావం ఉంటుంది" అని ధోనీ తెలిపాడు.
గత సీజన్ చేదు అనుభవాలను చెరిపేసి.. ఐపీఎల్-14లో శుభారంభం చేయాలని చూసిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి ముందు 189 పరుగుల భారీ లక్ష్యం నిలిపినా ఆ జట్టును విజయం వరించలేదు. అంత పెద్ద లక్ష్యాన్ని దిల్లీ 8 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
శిఖర్ ధావన్ (85; 54 బంతుల్లో), పృథ్వీ షా (72; 38 బంతుల్లో) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. మొదట చెన్నై 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54; 36 బంతుల్లో)తో పాటు మొయిన్ అలీ (36; 24 బంతుల్లో), సామ్ కరన్ (34; 15 బంతుల్లో) మెరిశారు. దిల్లీ బౌలర్లలో వోక్స్ (2/18), ఆవేశ్ ఖాన్ (2/23) రాణించారు.