దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. చాలా రకాల కార్యకలాపాలు తాత్కాలికంగా వాయిదా పడటం, నిలిచిపోవడం జరుగుతున్నా ఐపీఎల్ మాత్రం బయోబబుల్‌లో కొనసాగుతోంది.
సురక్షితమైన వాతావరణంలో ఈ మెగాలీగ్ కొనసాగుతున్నప్పటికీ క్రికెటర్లకు మాత్రం కరోనా భయం వెంటాడుతున్నట్లుంది. ఈ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు లీగ్‌ను వీడి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని ఓ క్రికెట్ ప్రతినిధి తెలిపారు. ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించడం కూడా వీరి భయాలకు కారణమని చెప్పారు.
జంపా, రిచర్డ్సన్ కూడా
ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆండ్రూ టై వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమవ్వగా.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ తన సొంత గూటికి వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరు స్వస్థలాలకు వెళ్తున్నారని ఫ్రాంచైజీ ప్రకటించింది.
మొత్తంగా ఐపీఎల్లో 17మంది ఆసీస్ ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో ఈ ముగ్గురు లీగ్ నుంచి తప్పుకోగా మిగతా వాళ్లలోనూ కొందరు వెళ్లిపోయే యోచనలో ఉన్నట్లు సదరు ప్రతినిధి తెలిపారు. మరి కరోనా వల్ల ఇంకెంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వైదొలుగుతారో చూడాలి.
ఇదీ చూడండి సూపర్ ఓవర్‌పై ధావన్ అలా.. కేన్ ఇలా!