ఐపీఎల్‌లో ఏర్పాటు చేసిన బయోబబుల్ సురక్షితమేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తెలిపాడు. ఐపీఎల్‌ను చివరి దశ వరకు చూస్తామని అభిప్రాయపడ్డాడు.
ఇటీవలే టోర్నీ నుంచి వైదొలిగిన జంపా, కేన్ రిచర్డ్‌సన్ గురువారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. అంతకుముందు తామున్న బుడగ సురక్షితమేమీ కాదని.. గతేడాది మాదిరే ఈసారి కూడా ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహిస్తే బాగుంటుందన్న జంపా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు.
"నేను, కేన్ క్షేమంగా.. సురక్షితంగా మెల్‌బోర్న్‌కు చేరుకున్నాం. ఐపీఎల్ బయోబబుల్ గురించి నా వ్యాఖ్యలకు.. వైరస్ ఏ దశలోనూ బుడగలోకి ప్రవేశిస్తుందన్న భావనతో సంబంధం లేదు. మేం సురక్షితంగా ఉండటానికి బీసీసీఐ, బెంగళూరు చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి. గొప్ప వ్యక్తుల చేతుల్లో ఐపీఎల్ అత్యంత సురక్షితంగా ఉందని నమ్ముతున్నా. లీగ్‌ను ఫైనల్ మ్యాచ్ వరకు తప్పకుండా చూస్తాం" అని జంపా ఒక ప్రకటనలో తెలిపాడు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ బయోబబుల్ నుంచి తప్పుకున్న రిఫరీ