IPL Media Rights Auction 2023: బీసీసీఐ పంట పండింది. వచ్చే ఐదేళ్లకు భారత టీ20 లీగ్ ప్రసార హక్కుల ధరలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దీంతో ఒక్క మ్యాచ్ విలువ రూ.107.5 కోట్లకు చేరింది. 2023-2027 కాలానికి సంబంధించి మీడియా హక్కుల కోసం ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ వేలంలో సోమవారం మధ్యాహ్నానికి టీవీ, డిజిట్ హక్కుల ధరలు ఖరారయ్యాయి.
ప్యాకేజీ-ఏ కింద భారత ఉప ఖండంలో టీవీ హక్కుల ధర రూ.23,575 కోట్లు పలకగా.. ప్యాకేజీ-బీ కింద డిజిటల్ హక్కుల ధర రూ.20,500 కోట్లకు పలికింది. ఈ రెండు హక్కులు వేర్వేరు ప్రసారదారులు దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ మొత్తం విలువ రూ.44,075 కోట్లకు చేరింది. రాబోయే ఐదేళ్లలో 410 మ్యాచ్‌ల కోసం ఈ మొత్తాన్ని బీసీసీఐ అందుకోనుంది. మరోవైపు 2017లో స్టార్ ఇండియా.. టీవీ, డిజిటల్ ప్రసార హక్కులకు మొత్తం కలిపి రూ.16,347 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు ఒక్కో మ్యాచ్ విలువ రూ.54.5 కోట్లుగా ఉంది.
ఐపీఎల్ ఈ మీడియా ప్రసార హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-ఏలో భారత ఉపఖండ టీవీ హక్కులు, ప్యాకేజీ-బీలో భారత ఉపఖండ డిజిటల్ హక్కులను చేర్చారు. ప్యాకేజీ- సీలో భారత ఉపఖండంలో మాత్రమే జరిగే ప్లేఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌ల డిజిటల్ హక్కులు, ప్యాకేజీ డీలో భారత్ మినహా మిగతా ప్రపంచ దేశాల్లో టీవీ, డిజిటల్ హక్కులు చేర్చారు. ఒక సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరిగితే ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 18గా ఉంటుంది. ఈ ఒప్పందంలోని చివరి రెండు సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాలున్నాయి. అప్పుడు ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 22 అవుతుంది. ఈ ఒక్కో ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్ ధర వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే ధరనే సంస్థలు బిడ్ చేయాల్సి ఉంటుంది. చివరకు అన్ని మ్యాచ్‌లకు కలిపి వాటిని లెక్కగట్టి అయిదేళ్ల కాలానికి ఎంత అవుతుందో తేలుస్తారు. ఒక్కో సంస్థ ఎన్ని ప్యాకేజీలకైనా బిడ్లు దాఖలు చేయవచ్చు.
ఇదీ చూడండి: వారితో నేను పోటీ పడలేదు.. ఎందుకంటే: గంగూలీ