ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ భారత్‌లో జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు 2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్, మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించడం బీసీసీఐకి సమస్యగా మారిందనే చెప్పవచ్చు. మరి రానున్న ఐపీఎల్ సీజన్‌ను భారత్‌లో నిర్వహించడానికి వీలు కాకపోతే.. బీసీసీఐ ప్లాన్ ఎలా ఉండనుందంటే..
ప్రతి ఏడాది ఐపీఎల్ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమౌతుంది. దాదాపు 50 -60 రోజులపాటు క్రికెట్ ప్రియుల్ని అలరించి.. మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే జూన్ 4 నుంచి 2024 టీ20 ప్రపంచకప్ జరగనున్నందున.. ఐపీఎల్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. మినీ వరల్డ్ కప్ సన్నద్ధతకు ఆయా దేశాల ఆటగాళ్లు, లీగ్‌లో మొత్తం మ్యాచ్‌లు ఆడకుండానే వారి స్వదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగే మన ప్లేయర్లకూ ప్రాక్టీస్ చేయడానికి ఉండే సమయం కూడా తక్కువే..
కాగా ఓ దశాబ్ద కాలం నుంచి భారత్ ఐసీసీ టోర్నమెంట్లలో ఛాంపియన్‌గా నిలవలేదు. దీనికి ఐపీఎల్ కూడా ఓ కారణమని ఇప్పటికీ.. పలువురు క్రీడా విశ్లేషకుల నుంచి బీసీసీఐ విమర్శలు ఎదుర్కొంటుంది. అందుకని 2024 ఐపీఎల్‌ను ముందుగానే ప్రారంభిద్దామంటే.. టీమ్ఇండియా.. స్వదేశంలో మార్చి 11 వరకూ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.
2024 ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు చేయడం.. బీసీసీఐకి ఓ సమస్య అయితే.. రానున్న వేసవిలోనే భారత పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనుండటం మరో సవాల్‌గా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించే ప్రధాన నగరాలలో మ్యాచ్‌లకు అనుమతులు లభించడం చాలా కష్టం. భద్రత కారణాల దృశ్య.. భారత్‌లో ఐపీఎల్ టోర్నీ నిర్వహించడం పెద్ద సవాలే.
గతంలో యూఏఈ వేదికగా..
2014 సంవత్సరం లోక్‌సభ ఎన్నికల కారణంగా.. ఐపీఎల్ దుబాయ్‌లో నిర్వహించింది బీసీసీఐ. సీజన్ మొదటి 20 మ్యాచ్‌లకు అబుదాబి, షార్జా మైదానాలు వేదికలయ్యాయి. భారత్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మిగత మ్యాచ్‌లను బీసీసీఐ స్వదేశంలోనే నిర్వహించింది. అయితే ఈ 2024లో కూడా ఇదే విధానాన్ని బీసీసీఐ అనుసరించనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ, శ్రీలంక రెండింట్లో ఏదో ఒక దేశాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం.
అయితే ఈసారి లీగ్‌ను 45 రోజుల్లో ముగించాలని బీసీసీఐ భావిస్తుందట. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లో కూడా రెండేసి మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ప్రస్తుతం బీసీసీఐ దృష్టి రానున్న వన్డే ప్రపంచకప్ పైనే ఉందని బోర్డు మెంబర్ ఒకరు తెలిపారు. 2024 ఐపీఎల్ గురించి వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. కాగా డిసెంబర్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.