ఐపీఎల్ 16వ సీజన్లో ముంబయి ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. తొలుత రెండు మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాల నుంచి వేగంగా కోలుకున్న ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టును పట్టాలెక్కించడంలో కేప్టెన్‌గా రోహిత్ శర్మ కీలక పాత్రను పోషించాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబయి.. తొలి రెండింట్లో ఓడింది. చివరి మూడు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించింది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
జోరు మీదున్న ముంబయి ఇండియన్స్‌కు మరో గుడ్‌న్యూస్ అందింది. కెప్టెన్ రోహిత్ శర్మ.. మరో బిగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఇప్పటివరకు సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, సూర్యకుమార్ యాదవ్.. రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే జాబితాలో తాజాగా రోహిత్ శర్మ కూడా చేరాడు.డిజిటల్ స్ట్రీమింగ్ యాప్‌కు ఇక రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని జియో సినిమా మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇప్పటికే రోహిత్ శర్మపై కొన్ని ఫొటో షూట్స్, ప్రోమోలను చిత్రీకరించింది జియో సినిమా యాజమాన్యం. వాటిని త్వరలోనే ప్రసారం చేయనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా టెలికాస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.
వార్నర్ రికార్డు బ్రేక్!
ఐపీఎల్ 2023లో దిల్లీ క్యాపిటల్స్ తొలి విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో దిల్లీ విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన వార్నర్.. ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ భాయ్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 26 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 146 సగటుతో 1042 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(1040) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రోహిత్ రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు.