సరిగ్గా ఆరు నెలల క్రితం వరకు టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్ లేమితో బాధపడుతున్న అతడిని భారత జట్టులో నుంచి పక్కకు తప్పించాలని కొందరు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాంటి సమయంలో ఆసియా కప్ ముందు కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. మళ్లీ ఫ్రెష్‌గా కనిపించాడు. ఆ టోర్నీ నుంచే మళ్లీ గాడిన పడినట్లు ఆడటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వరుసగా మూడు ఫార్మాట్లలో భారీ సెంచరీలు కూడా సాధించాడు. దీంతో కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడని అభిమానులు చాలా సంతోషించారు.
ఇదే విషయాన్ని తాజాగా కోహ్లీ కూడా ధ్రువీకరించాడు. 'నేను ఎలా ఆడతానో మళ్లీ అలా ఆడటం మొదలుపెట్టా. అయితే ఇంకా నా బెస్ట్ ఆటకు చేరుకోలేదని అనుకుంటున్నా. ఈ ఐపీఎల్‌లో అది జరుగుతుందని ఆశిస్తున్నా. నేను ఏ స్థాయిలో ఆడాలని అనుకుంటున్నానో.. ఆ స్థాయికి నా ఆట చేరి, జట్టుకు సాయం చేస్తే చాలా సంతోషిస్తా' అని చెప్పుకొచ్చాడు.
ఆట నుంచి బ్రేక్ తీసుకోవడం తనకు చాలా బాగా కలిసొచ్చిందని చెప్పాడు. 'ఈ ఆట పట్ల నా ప్రేమ మళ్లీ చిగురించడమే కావల్సింది. మైదానంలో చాలా కాలంగా జరుగుతున్న విషయాలకు దూరంగా వెళ్లిన తర్వాతే అది సాధ్యమైంది. నేను బాగా అలసిపోయా. మళ్లీ నాతో నేను ఒక మనిషిగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ, విమర్శించుకుంటూ ఉండటం సరికాదని అర్థమైంది' అని కోహ్లీ వివరించాడు. మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆడటం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు ఇక్కడ ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని అభిమానులకు హింటిచ్చాడు.
అయితే ఐపీఎల్ గత సీజన్లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 22 సగటుతో 341 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున కోహ్లీయే టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. 2022 సీజన్లో డుప్లెసిస్ 468 రన్స్ చేశాడు. అయితే ఈసారి మాత్రం డుప్లెసిస్ కోహ్లీ వెనక్కి నెట్టడం ఖాయమని ఆకాశ్ చోప్రా అంటున్నాడు.
"ఈ జట్టులో ఎవరు టాప్ స్కోరర్.. ఫాఫ్ లేదా విరాట్ కోహ్లీ? నేను విరాట్ కోహ్లీ అంటున్నాను. గతేడాది విరాట్ సరిగా ఆడలేదు. ప్రతిసారీ అలా జరగదు. అతడు ఈసారి పరుగులు చేస్తాడు. దీంతో టీమ్ మరింత బలోపేతం అవుతుంది. వాళ్ల దగ్గర ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో మంచి కెప్టెన్ ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే విరాట్, ఫాఫ్ ఓపెనింగ్ చేస్తారు. రజత్ పటీదార్ మూడోస్థానంలో వస్తాడు" అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.