Umesh Yadav IPL 2022: తొలి మ్యాచ్‌లోనే గత సీజన్ ఛాంపియన్ చెన్నైను చిత్తు చేసిన కోల్‌కతా రెండో మ్యాచ్‌లో మాత్రం బెంగళూరుపై పోరాడి ఓడింది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. ఈ క్రమంలో కోల్‌కతా రాణించడంలో కీలక పాత్ర ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ పోషిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనే 4.9 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ముందున్నాడు. ఉమేశ్ యాదవ్‌ను మెగావేలంలో కనీస ధర రూ. 2 కోట్లకే కోల్‌కతా దక్కించుకుంది. ఉమేశ్ యాదవ్ ప్రదర్శనపై కోల్‌కతా మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు.
''ఉమేశ్ యాదవ్‌ను దక్కించుకోవడమే టీ20 లీగ్ మెగా వేలంలో అత్యుత్తమ కొనుగోలుగా భావిస్తున్నా. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లను తీస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు. కోల్‌కతా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో కలిసి ఉమేశ్ యాదవ్ బాగా పని చేస్తున్నారు. ప్రతి గేమ్ కోసం ఉమేశ్ చాలా కష్టపడతాడు.'' అని హస్సీ పేర్కొన్నాడు. ఈ విధంగా ఎలా ఆడగలుగుతున్నావని ఉమేశ్‌ను అడిగితే 'నా మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే నా వెనక మద్దతుగా సహాయక సిబ్బంది ఉన్నారు. మరీ ముఖ్యంగా భరత్ అరుణ్ కోచింగ్‌లో ఉత్తమంగా ఆడగలుగుతున్నా' అని చెప్పేవాడని డేవిడ్ హస్సీ గుర్తు చేసుకున్నాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఉమేశ్.. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ గెలిచిన రెండింట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడే కావడం విశేషం. గత శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన ఐపీఎల్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు. 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ కూడా ఉంది. 2012లో దిల్లీ 4/24, 2017లో కోల్‌కతాపై 4/33.. అతడి గత అత్యుత్తమ ప్రదర్శనలుగా ఉన్నాయి. బుధవారం ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది కోల్‌కతా. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇవీ చూడండి: బౌలింగ్ ఇరగదీస్తున్న ఉమేశ్.. 'పంజాబ్' అంటే ఎందుకంత ఇష్టం?