ఇప్పటిదాకా జరిగిన టీ20ల్లో.. అందులో తొమ్మిది టైటిళ్లు రెండు జట్ల సొంతం. అవే.. ముంబయి, చెన్నై. ముంబయి రికార్డు స్థాయిలో అయిదు ట్రోఫీలు గెలిచి అగ్రస్థానంలో ఉంటే.. చెన్నై నాలుగు టైటిళ్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. నిరుడు కప్పు చెన్నైని వరిస్తే.. అంతకుముందు ఏడాది ముంబయి ఛాంపియన్. ఇంత ఘనమైన రికార్డున్న రెండు జట్లు ఈ సీజన్లో ఆడుతున్న తీరు చూసి అభిమానులకు దిమ్మదిరిగిపోతోంది. ఈ మెగా టోర్నీలో మూడింట ఒక వంతు మ్యాచ్‌లు పూర్తి కావస్తున్నా ఇంకా ముంబయి, చెన్నై ఖాతానే తెరవకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ రెండు జట్లూ తలో నాలుగు మ్యాచ్‌లు ఆడితే.. అన్నింట్లోనూ ఓటములే పలకరించాయి. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో చెన్నై, ముంబయి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. బలాబలాల పరంగా మరీ అంతరం ఉండని టీ20లో ఎలాంటి జట్టుకైనా వరుసగా ఒకట్రెండు ఓటములు ఎదురుకావడం మామూలే. కానీ ఇంత పేరున్న జట్లు సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు చొప్పున మ్యాచ్‌లు ఓడడం మాత్రం ఊహించనిదే. ఈ సీజన్ ముంగిట కొందరిని మినహాయించి మిగతా ఆటగాళ్లందరినీ వదులుకోవాల్సి రావడం, జట్టుకు బలంగా ఉన్న కొందరు కీలక ఆటగాళ్లను దూరం చేసుకోవడమే ముంబయి, చెన్నై వైఫల్యానికి మూలంగా చెప్పొచ్చు.
Reasons for Mumbai Indians struggling: ముందుగా ముంబయి విషయానికి వస్తే.. ఎప్పట్నుంచో ఆల్‌రౌండర్లే ఆ జట్టుకు అతి పెద్ద బలం. పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య.. ఇటు బ్యాటుతో, అటు బంతితో సత్తా చాటుతూ జట్టుకు ఎంతో ఉపయోగపడేవారు. వీరి వల్ల కూర్పులోనూ సమతూకం వచ్చేది. బౌలింగ్, బ్యాటింగ్ ప్రత్యామ్నాయాలు పెరిగేవి. అయితే గత సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని పాండ్య సోదరులను ఈసారి ముంబయి అట్టిపెట్టుకోలేదు. వేలంలోనూ వారిని తీసుకోలేదు. మరోవైపు పొలార్డ్ మునుపటి ఫామ్‌లో లేడు. వయసు పెరిగింది. ఫిట్‌నెస్ తగ్గింది. దీంతో కోరుకున్న స్థాయిలో అతను రాణించట్లేదు. ఇక కొన్ని సీజన్ల నుంచి జట్టుకు బౌలింగ్‌లో పెద్ద బలంగా ఉంటున్న ఫాస్ట్‌బౌలర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ రాహుల్ చాహర్‌లను కోల్పోవడం కూడా ముంబయికి గట్టి దెబ్బే. ఆరంభంలో బౌల్ట్, మధ్య ఓవర్లలో రాహుల్ చాహర్ కీలక వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులకు చెక్ పెట్టేవారు. అయితే ఇప్పుడు బుమ్రా తప్ప నమ్మదగ్గ పేసర్ జట్టులో లేడు. అతను కూడా ఒకప్పటి స్థాయిలో రాణించట్లేదు. మురుగన్ అశ్విన్.. చాహర్ స్థాయిలో రాణించట్లేదు. అవతలి ఎండ్ నుంచి ఒత్తిడి పెంచే బౌలర్ లేనపుడు.. మరో బౌలర్ ప్రదర్శనా పడిపోతుంది. బుమ్రా సత్తా చాటలేకపోతుండటానికి ఇదే కారణం. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. జట్టు ప్రధానంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల మీదే ఆధారపడుతోంది. సూర్యకుమార్ ఆలస్యంగా జట్టులోకి వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గొప్పగా బ్యాటింగ్ చేసినా.. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో జట్టు గెలవలేకపోతోంది. ప్రస్తుత ఆటతీరు ప్రకారం చూస్తే.. ముంబయి పుంజుకుని, ఇంత పోటీలో ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టంగానే కనిపిస్తోంది.
Reasons for Chennai super kings struggling: చెన్నైది కూడా దాదాపు ముంబయి లాంటి పరిస్థితే. గతంలో జట్టుకు పెద్ద బలంగా ఉన్న ఆటగాళ్లు కొందరిని కోల్పోవడం, కొందరు సత్తా చాటకపోవడం వల్ల ఇబ్బంది పడుతోంది. అందులో ముందు చెప్పుకోవాల్సిన పేరు.. డుప్లెసిస్‌దే. ఓపెనర్‌గా అతడి ఇన్నింగ్స్‌లు చెన్నైకి ఎన్ని విజయాలందించాయో లెక్కే లేదు. అలాంటి ఆటగాడు ఈ సీజన్‌లో బెంగళూరుకు వెళ్లిపోవడంతో ఓపెనింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇక చెన్నై బౌలింగ్ ప్రధాన అస్త్రం అయిన దీపక్ చాహర్ లీగ్ ముంగిట గాయపడి, ఇప్పటిదాకా బరిలోకి దిగలేదు. అతనెప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియట్లేదు. హేజిల్‌వుడ్ సైతం బెంగళూరుకి వెళ్లిపోవడం ప్రతికూలమైంది. మిల్నె, జోర్డాన్ అతడి స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. బ్రావో ఫామ్ కోల్పోయాడు. చెన్నైకి నాణ్యమైన స్పిన్నర్ కూడా అందుబాటులో లేడు. జడేజా, మొయిన్ అలీల కొరత తీర్చలేకపోతున్నారు. దీంతో బౌలింగ్ బలహీన పడిపోయింది. బ్యాటింగ్‌లో రాయుడు, ధోనీల జోరు తగ్గడం కూడా సమస్యగా మారింది. ఆటగాడిగా చక్కటి ప్రదర్శన చేస్తున్న జడేజా.. కెప్టెన్‌గా మారాక స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. నాయకుడిగా ఒత్తిడి ఎదుర్కొంటున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ స్థితిలో చెన్నై ప్రదర్శన ఏమాత్రం మెరుగవుతుందన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.
ఇదీ చూడండి: Sophia Thomalla: ఈ మోడల్‌ను చూసి తట్టుకోవడం కష్టమే!