IPL 2022 RCB Captain: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ట్రోఫీ సాధించని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఏటా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగటం, తీరా మధ్యలోనే చేతులెత్తేయడం ఆ జట్టుకు పరిపాటిగా మారింది. జట్టులోకి ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు వచ్చి వెళ్లినా.. ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. తాజాగా జరిగిన మెగా వేలంలోనూ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసినా.. ఈసారైనా దాని అదృష్టం మారుతుందో లేదో చూడాలి.
తేలాల్సిన విషయం..
ఆర్సీబీ కెప్టెన్‌గా గతేడాది 14వ సీజన్ పూర్తయ్యాక విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. 2013 నుంచీ ఆ జట్టు సారథిగా కొనసాగిన విరాట్ పనిభారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని అప్పట్లో చెప్పాడు. అయితే, ఇంకొద్దిరోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లోనూ ఆ జట్టు యాజమాన్యం ఇంకా కొత్త కెప్టెన్ పేరును వెల్లడించలేదు. దీంతో ఈసారి ఎవరు ఆ జట్టు పగ్గాలు అందుకుంటారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ రేసులో ఫాడుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
మళ్లీ అదే సమస్య..
ఆర్సీబీ ఎప్పుడూ చాలా తక్కువమంది ఆటగాళ్లపైనే అధికంగా ఆధారపడుతుంటుంది. అందులో ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పైనే శ్రద్ధ వహిస్తుంది. ఇదే ఆ జట్టుకున్న ప్రధాన సమస్య. మిడిలార్డర్‌లో సరైన ఫినిషర్ లేకపోవడం ఎప్పటికీ తీరని లోటులా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆ విషయంలో వెనుకపడినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే మెగా వేలంలో పేరుమోసిన ఫినిషర్లను తీసుకునే వీలున్నా ఆ విషయంపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఈసారి కొత్తగా దినేశ్ కార్తీక్ ఒక్కడే చెప్పుకోదగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అతడు రాణిస్తే ఫర్వాలేదు. కానీ, నిలకడలేమి ఆటతీరుతో డీకే ఏ మేరకు మెరుస్తాడో చూడాలి.
వీళ్లే కీలకం..
ఐపీఎల్ టోర్నీలో ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకూ ఒకే ఒక్క జట్టుతో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈసారి అతడు కెప్టెన్సీ పగ్గాలు వదులుకున్నా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడు ఐపీఎల్ ఆడేంతవరకూ ఇదే జట్టుతో కొనసాగుతానని కూడా స్పష్టం చేశాడు. దీంతో కోహ్లీ ఆ జట్టులో అంతర్భాగమని చెప్పాల్సిన పనిలేదు. అలాగే అతడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంతలా రాణిస్తాడో అందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో విరాటే నంబర్ వన్ బ్యాట్స్‌మన్. కానీ, అతనొక్కడే రాణిస్తే సరిపోదు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా దంచికొట్టాలి. అందుకే ఈసారి వేలంలో ఆ జట్టు యాజమాన్యం డుప్లెసిస్ లాంటి మేటి బ్యాట్స్‌మన్‌ను కొనుగోలు చేసింది. దీంతో అతడిని ఓపెనర్‌గా దించే అవకాశం ఉంది. మరోవైపు గతేడాది మెరుపు బ్యాటింగ్ చేసిన ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఎలాగూ ఉన్నాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌లో చెప్పుకోదగిన ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్, వానిండు హసరంగా మాత్రమే కనిపిస్తున్నారు. ఇలాంటి బ్యాటింగ్ లైనప్‌తో బెంగళూరు ఎలా ఆడుతుందనేది ఆసక్తిగా మారింది.
బౌలింగ్ ఓకే..
ఈసారి వేలంలో ఆర్సీబీ ముగ్గురు కీలక పేసర్లను కొనుగోలు చేయడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌ల గురించే. వీరిద్దరూ ప్రపంచస్థాయి బౌలర్లు. ఎలాంటి పరిస్థితులలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్నవారు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టులు. వీరికి తోడు మరో పేసర్ జేసన్ బేరండాఫ్‌ను కూడా కొనుగోలు చేసింది. మరోవైపు గతేడాది అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్‌ను కూడా రిటెన్షన్‌లో వదిలేసి వేలంలో భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అలాగే మహ్మద్ సిరాజ్‌ను అట్టిపెట్టుకుంది. దీంతో రాబోయే సీజన్‌లో ఆర్సీబీ మంచి పేస్ బౌలింగ్ దళాన్ని నియమించుకుంది. కానీ, స్పిన్ విభాగంలో నిర్దిష్టమైన ఆటగాడు కనిపించడం లేదు. అయితే, ఇక్కడ మాక్స్‌వెల్, హసరంగ మాత్రమే ప్రధానంగా చెప్పుకునే స్పిన్నర్లుగా ఉన్నారు. మరోవైపు మహిపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్ లాంటి దేశవాళీ ఆటగాళ్లు ఉన్నా.. వారు ఎలాంటి ప్రభావం చూపుతారో తెలియదు.
వీళ్లు లేకపోవడం పెద్దలోటే..
కాగా, ఈసారి వేలానికి ముందు దాదాపు అన్ని జట్లూ పలువురు కీలక ఆటగాళ్లను తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేసుకున్నా.. వేలంలో తిరిగి కొనుగోలు చేశాయి. కానీ, ఆర్సీబీ ఈసారి ఆ విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎందుకంటే యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్, ఎంతో అనుభవమున్న స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లాంటి కీలక ఆటగాళ్లను కూడా తిరిగి సొంతం చేసుకోలేకపోయింది. అలాగే ఈసారి వేలానికి ముందే స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో ఆర్సీబీ జట్టులో అద్భుతంగా ఆడే ముగ్గురు కీలక ఆటగాళ్ల సేవలను ఆ జట్టు కోల్పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు టీమ్ ఏ మేరకు మెరుస్తుందో.. అదృష్టం కలిసొచ్చి ఏకంగా కప్పే కొట్టేస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి.
ఇదీ చూడండి: మటన్ రోల్ కోసం కోహ్లీ రిస్క్.. కారును వెంబడించిన దుండగులు