IPL 2022: ఐపీఎల్‌లో రెండో టైటిల్ కోసం రాజస్థాన్ రాయల్స్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2008లో తొలిసారి విజేతగా నిలిచిన ఆ జట్టుకు మళ్లీ ఆ ముచ్చట తీరలేదు. విజేతగా నిలవడం కోసం దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఈసారి ఎలాగైనా టైటిల్ పట్టేయాలనే పట్టుదలతో లీగ్‌లో అడుగుపెడుతోంది. దాదాపు పూర్తిగా మారిన జట్టుతో తాజాగా ఈ సీజన్‌లో తలపడేందుకు సిద్ధమైంది. కెప్టెన్ సంజు శాంసన్ (రూ.14 కోట్లు), బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైశ్వాల్ (రూ.4 కోట్లు)ను అట్టిపెట్టుకున్న జట్టు.. మెగా వేలంలో మరో 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమ్‌ఇండియా తరపున అరంగేట్రం చేసి అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కోసం వేలంలో అత్యధికంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టింది. విండీస్ విధ్వంసక బ్యాటర్ హెట్‌మయర్ (రూ.8.5 కోట్లు), బౌల్ట్ (రూ.8 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్ (రూ.7.75 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ.6.5 కోట్లు), అశ్విన్ (రూ.5 కోట్లు)ను దక్కించుకుని జట్టును అన్ని విభాగాల్లోనూ పటిష్ఠపర్చుకునే ప్రయత్నం చేసింది. రాజస్థాన్ సమష్టిగా సత్తాచాటితే ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది.
![Sanju Samson](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/86333debad8026793fbc67a9cbd3bb30_0212a_1638445113_776.jpg)
బలాలు..
రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాటింగే ప్రధాన బలం. కెప్టెన్ శాంసన్‌తో పాటు బట్లర్, పడిక్కల్, జైశ్వాల్, హెట్‌మయర్, వాండర్ డసెన్, పరాగ్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. ముఖ్యంగా గత రెండు సీజన్లలో ఆర్సీబీ తరపున ఓపెనర్‌గా రాణించిన పడిక్కల్‌ను వేలంలో సొంతం చేసుకోవడం రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. దేశవాళీ క్రికెట్లోనూ అతను అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో పరిమిత ఓవర్ల ఉత్తమ ఆటగాళ్లలో ఒకడైన బట్లర్ నిలకడగా విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ తన ధనాధన్ ఆటతో అదరగొడుతున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై శతకం సాధించిన అతని జోరు రాజస్థాన్‌కు ఎప్పటిలాగే బలాన్ని అందిస్తుంది. ఇక శాంసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను భారీ షాట్లతో మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. గతంలో టాప్‌ఆర్డర్ రాణించినా.. మిడిలార్డర్ విఫలమవడంతో ఆ జట్టు ఓటమి పాలయ్యేది. ఇప్పుడా సమస్యను అధిగమించేందుకు హెట్‌మయర్, డసెన్‌లను జట్టులోకి తీసుకుంది రాజస్థాన్. వీళ్లతో పాటు తిరిగి వేలంలో దక్కించుకున్న రియాన్ పరాగ్ ఉన్నాడు. ఇక ఎంతో అనుభవం ఉన్న అశ్విన్, చాహల్‌తో కూడిన స్పిన్ విభాగం ఆ జట్టుకు మరో బలం.
బలహీనతలు..
![Rajasthan Royals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14764056_rr.jpg)
మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే నిఖార్సైన ఆల్‌రౌండర్లు లేకపోవడం రాజస్థాన్‌కు ప్రతికూలాంశం. జట్టులో హిట్టర్లు ఉన్నప్పటికీ అవసరమైన సమయాల్లో బ్యాట్‌తో, బంతితో ఉపయోగపడే ఆల్‌రౌండర్ కనిపించడం లేదు. కివీస్ ఆల్‌రౌండర్ నీషమ్‌ను తీసుకున్నప్పటికీ అతని సామర్థ్యంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకూ ఐపీఎల్ వివిధ జట్ల తరపున అతను పెద్దగా ఆకట్టుకోలేదు. కౌల్టర్‌నైల్, మిచెల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ పరాగ్ ఉన్నా అతను ఏ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చెప్పడం కష్టమే. శాంసన్ నిలకడ లేమి జట్టుపై ప్రభావం చూపే అవకాశముంది. భారీ అంచనాలను అందుకోవడంలో అతను విఫలమవుతున్నాడు. ఇక జట్టు వనరులను సమర్థంగా వాడుకుంటూ విజయాలు అందించే నాయకుడి పాత్రను అతను ఇంకా మెరుగ్గా పోషించాల్సిన అవసరం ఉంది. పేస్ బౌలింగ్‌లో అనుభవ లేమి రాజస్థాన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విదేశీ పేసర్లలో బౌల్ట్ ఒక్కడే ఆశాజనకంగా కనిపిస్తున్నాడు. మెకాయ్‌పై నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. ఇక కౌల్టర్‌నైల్‌ను తరచూ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. భారత బౌలర్లలో భారీ ధర పలికిన ప్రసిద్ధ్ కృష్ణ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడన్నది కీలకం. జట్టులో అతణ్ని మినహాయిస్తే మరో ప్రధాన దేశీయ పేసర్ కనిపించడం లేదు. నవదీప్ సైని ఉన్నా.. కొన్ని సీజన్లుగా అతని ప్రదర్శన చెప్పుకోదగ్గ విధంగా లేదు. ఇక జట్టు కూర్పు కూడా తలనొప్పిగా మారే ఆస్కారం ఉంది.
దేశీయ ఆటగాళ్లు: శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, కరుణ్ నాయర్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్, అనునయ్ సింగ్, అశ్విన్, పరాగ్, శుభమ్, కరియప్పా, కుల్‌దీప్ సేన్, కుల్‌దీప్ యాదవ్, నవదీప్ సైని, ప్రసిద్ధ్ కృష్ణ, తేజస్, చాహల్
విదేశీయులు: బట్లర్, వాండర్ డసెన్, హెట్‌మయర్, డారిల్ మిచెల్, నీషమ్, కౌల్టర్‌నైల్, మెకాయ్, బౌల్ట్
కీలకం: శాంసన్, పడిక్కల్, బట్లర్, అశ్విన్, చాహల్, బౌల్ట్.
ఉత్తమ ప్రదర్శన: 2008లో విజేత
ఇదీ చదవండి: IPL 2022 Delhi Capitals:దిల్లీ కల ఈ సారైనా నెరవేరేనా!