స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. ఈ విషయమై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో గంభీర్.. రోహిత్‌కు సపోర్ట్ చేయగా, ఆకాశ్ చోప్రా కోహ్లీకి అండగా నిలిచాడు.
ఇటీవలే జరిగిన ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. రోహిత్ సారథ్యంలో ఐదో టైటిల్‌ను గెలుచుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో హిట్‌మ్యాన్‌కు చోటు లభించలేదు. దీంతో రోహిత్‌కు టీమ్ఇండియా టీ20 జట్టు బాధ్యతలు అప్పగించాలని లేదంటే జట్టుకు చాలా పెద్ద నష్టమని అన్నాడు. కోహ్లీ ఇంతవరకు ఐపీఎల్లో ఒక్క టైటిల్ గెలవలేకపోయాడని గౌతీ విమర్శించాడు.
వీటిపై స్పందించిన మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. గంభీర్ వ్యాఖ్యల్ని ఖండించాడు. కోహ్లీని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగించాలని అన్నాడు. ఒకవేళ రోహిత్‌కు ఆర్సీబీ పగ్గాలు అప్పగిస్తే, ఇన్ని టైటిళ్లు సాధించగలడా? అని గంభీర్‌ను ప్రశ్నించాడు ఆకాశ్. ముంబయి జట్టును టీమ్ఇండియాతో పోల్చడం సరికాదని చెప్పాడు.
ప్రస్తుతం సిడ్నీలో క్వారంటైన్లో ఉన్న భారత క్రికెటర్లు.. నవంబరు 27న ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడనున్నారు. పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. గాయమైన కారణంగా రోహిత్‌ను చివరి మూడు టెస్టుల కోసం మాత్రమే ఎంపిక చేశారు.