ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకు విజయవంతం అవుతుందో ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరించాడు. అనుకూల ఫలితాలు రానప్పుడు ప్రశాంతంగా ఉండటమే తమ విజయ రహస్యమని పేర్కొన్నాడు. షేన్ వాట్సన్ (83; 53 బంతుల్లో) ఫామ్‌లోకి రావడం ఇందుకు ఉదాహరణగా వర్ణించాడు. పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించాక ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడాడు.
"ఎక్కువ అవకాశాలు ఇవ్వడమే ఆటగాళ్లకు సాయపడుతోంది. మేం బాగా లేని విభాగాలను గుర్తిస్తాం. కానీ జట్టును మార్చేందుకు ఇష్టపడం. ఎందుకంటే ఆ మార్పు ఉపయోగపడుతుందో లేదో తెలియదు. ఆటతీరు, పరిస్థితులను మెరుగుపర్చేందుకు మేం ప్రయత్నిస్తాం. బాగా ఆడితే వీలైనంత సుదీర్ఘకాలం ప్రోత్సహిస్తాం."
-ఫ్లెమింగ్, సీఎస్కే కోచ్
వాట్సన్ ఫామ్‌లోకి వచ్చేందుకు ఏం చేశాడన్న ప్రశ్నకు ఏమీ లేదని జవాబిచ్చాడు ఫ్లెమింగ్.
"అనుభవం ఉన్న ఆటగాడు అలాగే ఆడతాడు. వాట్సన్ కనుక నెట్స్‌లో ఇబ్బంది పడితే మేం ఆందోళన చెందాలి. కానీ అతడలా కనిపించలేదు. కాస్త ఓపిక పడితే, అదృష్టం కలిసొస్తే, సానుకూలంగా ఆలోచిస్తే ఇలాంటి ప్రదర్శనలు వస్తాయి. డుప్లెసిస్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నిజానికి వాట్సన్ ఫామ్‌లోకి వస్తేనే పోటీ మరింత పెరుగుతుంది. పంజాబ్‌ను 17-20 ఓవర్ల మధ్య కట్టడి చేయడంతోనే మాకు గెలుపు సాధ్యమైంది. అదే మ్యాచులో అత్యంత కీలకం. డెత్‌లో వారిని 42 పరుగులకే పరిమితం చేయడం గొప్ప విషయం" అని ఫ్లెమింగ్ వివరించాడు.