రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా చివర్లో కొట్టిన ఐదు సిక్సులు మ్యాచ్ గమనాన్నే పూర్తిగా మార్చేశాయని అన్నాడు ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ గెలవడంలో తెవాతియా కీలకపాత్ర పోషించాడని కొనియాడాడు.
"కాట్రెల్ బౌలింగ్‌లో తెవాతియా రాణించడం మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్ అనుభవాన్ని గుర్తు తెచ్చుకున్నాం. ఇది చిన్న మైదానం. వికెట్లు కోల్పోకుండా నిలబెట్టుకోగలిగితే గెలిచే అవకాశం ఉంటుందని భావించాం. కాట్రెల్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టిన సంజూకే మొత్తం క్రెడిట్ లభిస్తుంది. ఒకనొక సమయంలో 250 లక్ష్యాన్ని అయినా ఛేదించగలమనే నమ్మకం నాలో వచ్చింది."
- స్టీవ్ స్మిత్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
సరికొత్త రికార్డు
పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఛేదనలో బట్లర్(4) విఫలమైనా సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4x4, 7x6), స్టీవ్‌స్మిత్(50; 27 బంతుల్లో 7x4, 2x6) చెలరేగి ఆడారు. వీరిద్దరూ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేసి ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాబట్టారు. దీంతో రాజస్థాన్ 9 ఓవర్లకే 100 పరుగులు చేరింది. అయితే, నీషమ్ వేసిన అదే ఓవర్ చివరి బంతికి అప్పుడే అర్ధశతకం సాధించిన స్మిత్ భారీషాట్ ఆడబోయి షమీ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్ కీలక సమయంలో ప్రధాన వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాతియా(53; 31 బంతుల్లో 7x6) తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఇక పరిస్థితి చేయి దాటిపోతున్న వేళ సంజూ విజృంభించి ఆడాడు. ఈ క్రమంలోనే అతడు శతకానికి చేరువైన సమయంలో షమీ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి ఓ భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ గెలుపు ఖాయమని అంతా భావించారు.

గేమ్ ఛేంజర్ తెవాతియా
ఇక రాజస్థాన్ విజయానికి 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన స్థితిలో తెవాతియా అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటివరకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన ఇతడు.. షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో మొత్తం 5 సిక్సులు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తర్వాతి ఓవర్‌లోనూ జోఫ్రా ఆర్చర్ (13; 3 బంతుల్లో 2x6), రాహుల్ మూడు సిక్సర్లు బాదడం వల్ల మొత్తం 19 పరుగులు వచ్చాయి. అలా రాజస్థాన్ ఆ రెండు ఓవర్లలోనే 49 పరుగులు సాధించి విజయానికి చేరువైంది. చివరి ఓవర్‌లో తెవాతియా ఔటైనా టామ్ కరన్(4) వచ్చీరాగానే బౌండరీ బాది అద్భుత విజయాన్ని అందించాడు.

పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. కాట్రెల్, నీషమ్, మురుగన్ అశ్విన్ చెరో ఓ వికెట్ పడగొట్టారు. కాగా, రాజస్థాన్ చివరి 27 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇది కూడా టోర్నీ చరిత్రలో ఒక రికార్డు కావడం విశేషం.