ఈసారి ఐపీఎల్ ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించకపోవచ్చు. అందుకే కారణాలు ఏమైనా సరే.. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు అత్యద్భుతమైన బౌలర్ దొరికాడు. అతడే యార్కర్ల కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుస్తున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి.నటరాజన్. అతడి ప్రదర్శన హైదరాబాద్ ఫ్రాంచైజీనే కాదు బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేలా చేసింది. త్వరలో నటరాజన్, టీమ్ఇండియా తలుపు తట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఆదివారం క్వాలిఫైయర్-2లో ఓడిన హైదరాబాద్ ఈ సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.అయితే నటరాజన్ బౌలింగ్ ప్రదర్శన పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయని సహచర ఆటగాడు కేన్ విలియమ్సన్ చెప్పాడు. అతడికి ఐపీఎల్ ఓ గొప్ప అవకాశమని కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు.
!['T Natarajan is a find of this IPL'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6eeb79cc6497a1c7fa24bccfc22023d7_0911newsroom_1604905119_932.jpg)
నటరాజన్‌పై మాజీల చూపు
తనదైన యార్కర్లతో యార్కర్ స్పెషలిస్టుగా నటరాజన్ పేరు తెచ్చుకున్నాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లాడి 16 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా 377 బంతులు వేయగా.. 8.02 ఎకానమీతో 504 పరుగులను సమర్పించాడు. డెత్ ఓవర్లలో తన యార్కర్ బౌలింగ్‌తో మాజీ క్రికెటర్లు తనవైపు చూసేలా చేశాడు.
ఇలాంటి యార్కర్లను చూడలేదు
"టీమ్ఇండియాకు ఎంపిక కాని ఓ బౌలర్ ఐపీఎల్లో ఇలాంటి కచ్చితమైన యార్కర్లు వేయడం ఎప్పుడూ చూడలేదు" అని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
!['T Natarajan is a find of this IPL'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vbcvvcg_0911newsroom_1604905119_569.jpg)
గత శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది. ఈ మ్యాచ్‌లో కచ్చితమైన యార్కర్లతో డివిలియర్స్నూ ఔట్ చేశాడు నటరాజన్.