ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి జరుగుతోన్న వేలంలో విదేశీ ఆటగాళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆండ్రూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్ వంటి స్టార్ క్రికెటర్లు తొలి సీజన్ వేలంలో భారీ ధర పలికారు. అలాగే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం ఐపీఎల్ వేలంలో ప్రవేశించినప్పటి నుంచే భారీ డిమాండ్‌తో ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
వేలంలో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాళ్లందరూ నిలకడగా కొనసాగిన సందర్భాలు కొన్నే.. అందులో కొంతమంది క్రికెటర్లు విఫలమైనవారున్నారు. ఫ్రాంచైజీలు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అత్యధిక మొత్తానికి న్యాయం చేసిన వారు కొంతమందే ఉన్నారు. త్వరలోనే ఐపీఎల్ సీజన్ 14కి సంబంధించిన మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లెవరో చూద్దాం..
ప్యాట్ కమిన్స్ (రూ.15.5 కోట్లు)
ఐపీఎల్ వేలంలోకి వచ్చిన తర్వాత ఓ సీజన్లో ప్రదర్శన చేయకపోయినా.. గతేడాది జరిగిన లీగులో మైదానంలో అడుగుపెట్టాడు ప్యాట్ కమిన్స్. తన అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. గతేడాది వేలంలో కమిన్స్‌ను సొంతం చేసుకునేందుకు దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీపడ్డాయి. ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ.15.25 కోట్ల వేలం పాడింది. అంతలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.15.5 కోట్లు వెచ్చించి ఈ ఆసీస్ ఆటగాడ్ని కొనుగోలు చేసింది.
![Most expensive overseas picks in the history of IPL auctions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10458570_2.jpg)
ఐపీఎల్ 13వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి.. 12 వికెట్లు పడగొట్టాడు కమిన్స్. తాను ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లను సాధించాడు. దీంతో 2021లో జరగనున్న సీజన్‌కూ కమిన్స్‌ను కేకేఆర్ జట్టు అట్టిపెట్టుకుంది.
బెన్ స్టోక్స్ (రూ.14.5 కోట్లు)
![Most expensive overseas picks in the history of IPL auctions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10458570_4.jpg)
2017లో జరిగిన ఐపీఎల్ సీజన్ కోసం వేలంలోకి వచ్చాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. ఇతడిని రూ.14.5 కోట్లతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఆ ఏడాది అత్యధిక పారితోషికం అందుకున్న విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈసారి వేలంలో అతడ్ని ఎవరూ కొనుగోలు చేయరని భావించారు. అయితే ఫ్రాంచైజీ అతడిపై నమ్మకం ఉంచి అట్టిపెట్టుకుంది.
బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు)
ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లాగే రెండో ఏడాదిలోనూ బెన్ స్టోక్స్ నిలకడగా ప్రదర్శన చేయలేదు. రెండో సీజన్లో రూ.12.5 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈసారి కూడా పూర్తి సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.
![Most expensive overseas picks in the history of IPL auctions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10458570_3.jpg)
ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 161 బంతులను ఎదుర్కొని 196 పరుగులను రాబట్టగలిగాడు. 8 వికెట్లు పడగొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు స్టోక్స్ రాజస్థాన్ జట్టులోనే కొనసాగుతున్నాడు.
తైమల్ మిల్స్ (రూ.12 కోట్లు)
2017లో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో తైమల్ మిల్స్ కూడా ఉన్నాడు. ఆ ఏడాది రూ.12 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు అతడిని సొంతం చేసుకుంది.
![Most expensive overseas picks in the history of IPL auctions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10458570_1.jpg)
ఆ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తైమల్ మిల్స్ పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. 8.57 బౌలింగ్ సగటుతో 5 వికెట్లను పడగొట్టాడు. దీంతో ఆర్సీబీ జట్టు మిల్స్‌ను వదిలేయగా.. ఆ తర్వాత అతడ్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
ఇదీ చూడండి: ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ 2021!