దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఉత్కంఠపోరులో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. సూపర్ఓవర్లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కొన్ని చిన్న తప్పిదాల వల్లే మ్యాచ్ సూపర్‌ఓవర్ వరకూ వచ్చిందని ఇంటర్వ్యూలో వెల్లడించాడు కోహ్లీ.
"ప్రస్తుతానికి నాకు మాటలు రావడం లేదు. ఈ రోజు మ్యాచ్ రోలర్-కోస్టర్‌ను తలపించింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు చాలా ఓపికగా ఆడారు. మా ప్రణాళికలు అమలు చేయడానికి ప్రయత్నించాం. చివరికి మాకే విజయం లభించింది. మ్యాచ్‌లో చేసిన కొన్ని చిన్న తప్పిదాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. సూపర్ఓవర్లో ఆడేందుకు ఉత్తమమైన వ్యక్తులు ఎవరని ఆలోచించగా.. చివరికి నేను, ఏబీ డివిలియర్స్ కలిసి ఆ బాధ్యతల్ని తీసుకున్నాం. ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేయకుండా ఉండి ఉంటే సూపర్ఓవర్కు దారి తీసేదే కాదు."
- విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దిగిన రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ మాత్రమే చేయడం వల్ల మ్యాచ్ టైగా నిలిచి సూపర్ఓవర్కు దారితీసింది. అందులో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా తర్వాత బెంగళూరు ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం వల్ల టోర్నీలో రెండో గెలుపును నమోదు చేసుకుంది కోహ్లీసేన.