'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వూలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దిగ్గజ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటంపై తన అనుభవాలను వెల్లడించాడు.
అండర్-19 జట్టులో అద్భుత ప్రదర్శన చేశారు. ఇప్పుడు పంజాబ్ జట్టులోని దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం ఎలా ఉంది?
బిష్ణోయ్ : నా వయస్సు వారితో గడపటం చాలా సులువు. కానీ పంజాబ్ జట్టులోని క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం గొప్ప అనుభూతి. నాకు ఇలాంటి వారితోనే ఐపీఎల్ ఆడాలనే కల ఉండేది.
అండర్-19జట్టుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? కుంబ్లే దగ్గర బౌలింగ్ ప్రాక్టీస్ చేయటం , కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడటం, గేల్ ఇప్పుడు మీ సహచరులు, కోహ్లీ, ధోనీలకు బౌలింగ్ చేయటం ఎలా అనిపిస్తుంది ?
అనిల్ సర్ ఎప్పటికీ నాకు ఆదర్శం. ఆయన్ను టీవీలో చూస్తూ పెరిగా, ఇప్పుడు ఆయనతోనే డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాను. ఇది అందరిలాగే నాకూ ఓ కల. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఇక మా బాస్( క్రిస్ గేల్ ) టీ20లీగ్‌కే కింగ్ లాంటివారు. ఆయనతో ఉండటం గొప్ప అనుభూతి. కెప్టెన్ రాహుల్ చాలా కూల్.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మీకు నచ్చిన లెగ్ స్పిన్నర్?
ఈ ఐపీఎల్లో చాహల్, రషీద్ ఖాన్ అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నారు. వారి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
అండర్-19లో అద్భుత ప్రదర్శన చేశారు .ఇప్పుడు మీపై అంచనాలు పెరిగిపోయాయి. ఒత్తిడికి ఏమైనా లోనవుతున్నారా?
ఇలాంటి లీగ్‌ల్లో ఒత్తిడి సహజం. కానీ మాలాంటి వారికి ఇదో గొప్ప అవకాశం. మేం జట్టు విజయం కోసం కృషి చేస్తున్నాం. మొదటి మ్యాచ్‌లో కొంత నిరాశకు లోనయ్యా కానీ ఇప్పుడు లేదు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ప్రస్తుతం ప్లేఆఫ్ అవకాశాల కోసం శ్రమిస్తోంది. కానీ ముందు వరుసలో ఉన్న ముంబయి, దిల్లీ, బెంగళూరు జట్లకు గట్టి పోటీ ఇచ్చి, గత మ్యాచ్‌ల్లో వాటినే ఓడించింది.