షార్ట్ రన్ కారణంగా దిల్లీ జట్టు చేతిలో ఓడిన పంజాబ్.. న్యాయం జరిగేవరకు తగ్గేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ మ్యాచ్‌లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న కోహ్లీ సేనతో గురువారం దుబాయ్ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా సత్తాను నిరూపించుకోవాలని కసితో బరిలో దిగబోతోంది కేఎల్ రాహుల్ సేన. మరోవైపు ఆర్సీబీ కూడా తమ విజయాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
పంజాబ్
ఈ సీజన్లో పంజాబ్.. బ్యాటింగ్ విభాగంలో బలంగానే కనిపించినప్పటికీ దిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే విఫలమైంది. 30పరుగుల వద్దే సారథి కేఎల్ రాహుల్(21) తేలిపోయాడు. గేల్‌ను ఈ మ్యాచ్‌కు దూరం పెట్టడం ఈ ప్రాంచైజీ చేసిన ఓ తప్పని భావించవచ్చు. సాధారణంగా వీరిద్దరి ఓపెనింగ్ జోడీ అద్భుతంగా ఉంటుంది. మ్యాచ్‌ను వారివైపు తిప్పుకునే సత్తా వీరిలో ఉంది. కాబట్టి ఆర్సీబీతో జరిగే పోరులోనైనా జట్టు ఈ తప్పును రిపీట్ చేయకుండా ఉంటే కలిసొచ్చే అవకాశం.
కాగా, మ్యాక్స్‌వెల్, మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్ రూపంలో కావాల్సినంత హిట్టింగ్ లైనప్ ఉంది. మిడిల్ ఓవర్స్‌లో పరుగుల వరద పారించేందుకు పాకెట్ రాకెట్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. అలాగే నికోలస్ పూరన్, హార్డస్ విజియోన్, జేమ్స నీషమ్, కరుణ్ నాయర్, క్రిస్ జోర్డాన్ వంటి నాణ్యమైన టీ20 బ్యాట్స్‌మన్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఎలాంటి గాయాలు కాకుండా ఉంటే మహ్మద్ షమీ, ముజిబుర్ రెహ్మన్, షెల్డన్ కాట్రెల్, మురుగన్ వారి సత్తా మేరకు రాణించగలరు. అయితే ఇప్పటికే గాయం అయిన అశ్విన్ ఈ మ్యాచులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే.
బెంగళూరు
బెంగళూరు విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సారథి కోహ్లీ తప్ప అంచనాలు ఉన్న ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్ (56), ఆరోన్ ఫించ్ (29), ఏబీ డివిలియర్స్ (51) అనుకున్నట్లే బాగా రాణించారు. ఇక చాహల్ తన స్పిన్ మాయాజలంతో మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. కాబట్టి పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఫామ్ ఇలానే కొనసాగిస్తే ఆర్సీబీ మరో విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.
స్క్వాడ్ (అంచనా)
ఛాలెంజర్స్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్పీ(వికెట్ కీపర్), శివం దుబే, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైని, స్టెయిన్, యజ్వేంద్ర చాహల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, షెల్డన్ కాట్రల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమి.