కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. మరింత దూకుడుగా ఆడాలని మాజీ క్రికెటర్ వీరందర్ సెహ్వాగ్ చెప్పాడు. లేదంటే అతడి బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలని ఫ్రాంచైజీకి సూచించాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన గిల్..116.52 స్ట్రైక్‌రేట్‌తో 275 పరుగులు చేశాడు. కోల్‌కతా తరఫున ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన వారిలో అతడే ముందున్నాడు. కానీ మొత్తంగా 200 కంటే పరుగులు చేసిన వారి స్ట్రైక్‌రేట్ చూస్తే శుభ్మన్దే అత్యల్పం.
"శుభ్‌మన్ గిల్‌కు కోల్‌కతా చాలా అవకాశాలిచ్చింది. కాకపోతే పవర్ ప్లేలో అతడు ఇంకా దూకుడుగా ఆడాలి. లేదంటే బ్యాటింగ్ స్థానాన్ని మార్చండి. అప్పుడైనా సరే ఆడతాడేమో. గెలవాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం బలంగా ఉండాలి. అదే లేకపోతే ఇన్నింగ్స్ నిర్మించడం, మ్యాచ్‌లు గెలవడం కష్టమవుతుంది" -సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
ఈ సీజన్లో నిలకడ లేమితో బాధపడుతున్న కోల్‌కతా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ వైఫల్యాల కారణంగానే కెప్టెన్‌గా దినేశ్ కార్తిక్ తప్పుకుని, ఆ బాధ్యతల్ని మోర్గాన్‌కు అప్పగించారు.
ఆదివారం(అక్టోబరు 18) జరిగే తన తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో అబుదాబి వేదికగా కోల్‌కతా తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నరకు ప్రారంభం కానుంది.