ఐపీఎల్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. ఇందులో గెలిచిన టీమ్ టాప్-4లో ఉండాలంటే.. పంజాబ్ తన తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవాలి. సన్‌రైజర్స్ కూడా రెండు మ్యాచ్‌ల్లో ఏదో ఒకదానిలో ఓటమిపాలవ్వాలి.
రాజస్థాన్‌కూ అవకాశాలున్నాయి!
గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన రాజస్థాన్.. ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోరును కోల్‌కతాపైనా కొనసాగించాలని చూస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్, సంజూ శాంసన్, కెప్టెన్ స్మిత్, ఉతప్ప అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్.. వీరికి సహకారమందిస్తే సరిపోతుంది. బౌలింగ్‌లో ఆర్చర్, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. కానీ మిగిలిన బౌలర్లు కూడా ఇతడితో పాటే రాణిస్తే రాజస్థాన్ గెలుపు లాంఛనమే!
కోల్‌కతా ఓడితే అంతే
12 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కోల్‌కతా జట్టు.. రాజస్థాన్‌పై కచ్చితంగా గెలవాలి. లేదంటే అంతే సంగతులు! జట్టులోని నితీశ్ రానా బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారు. బౌలర్లలోనూ వరుణ్ స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకుంటున్నా సరే పేస్ విభాగం ప్రదర్శన నామమాత్రంగానే ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఏం చేస్తారో చూడాలి?
జట్లు(అంచనా)
రాజస్థాన్: ఉతప్ప, స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్మిత్ (సారథి), రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి
కోల్‌కతా: శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్, మోర్గాన్(కెప్టెన్), నరైన్, కమిన్స్, ఫెర్గుసన్, కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి