దిల్లీ క్యాపిటల్స్ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఈ ఐపీఎల్లో తన ఆటను చాలా నెమ్మదిగా మొదలుపెట్టాడు. కానీ మెల్లమెల్లగా జోరు పెంచి ప్రస్తుతం పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో 20ల స్కోరుకే ఔటయ్యాడు. కానీ గత రెండు మ్యాచుల్లో వరుస సెంచరీలు బాది 465 పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. తన ఆట గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తాను అస్సలు పట్టించుకోనని చెప్పాడు.
"నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండటమే ఇష్టం. ఒత్తిడిలో ఉండటం నచ్చదు. ముందుగా ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని అస్సలు పట్టించుకోను. రెండోది నేను ఆటను ఎక్కువగా ప్రేమిస్తా. అది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆట కోసం ఎంత కష్టపడతానో నాకు తెలుసు. అంతేకాదు, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఈ విషయంపై పూర్తి నమ్మకం ఉంది."
-ధావన్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు.
అలాగే తమ జట్టు కోచ్ రికీ పాంటింగ్ తన బ్యాటింగ్ తీరుని ప్రశంసించాడని తెలిపాడు ధావన్. తొలి మ్యాచుల్లో తాను చేసింది తక్కువ పరుగులే అయినా అవి ఎంతో ప్రభావితం చేశాయని అన్నాడు.
ఇదీ చూడండి ఐపీఎల్ తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో ధోనీ?