ఐపీఎల్ టోర్నీలో ప్రారంభం నుంచే అంపైర్ల తీరుపై విమర్శలు వస్తున్న తరుణంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో తప్పిదం వెలుగులోకి వచ్చింది. డీఆర్ఎస్ నిబంధనల్లో ఒక సవరణ అవసరమని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏం జరిగిందంటే!
గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ పేసర్ షమీ వేసిన 17వ ఓవర్ చివరి బంతి కీరన్ పొలార్డ్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో పంజాబ్ అప్పీల్ చేయగా ఔట్‌గా అంపైర్ ప్రకటించాడు. దీనిపై పొలార్డ్ రివ్యూకు వెళ్లగా అందులో నాటౌట్ అని తేలింది. అయితే ఫీల్డ్ అంపైర్ ఎల్బీగా ప్రకటించే క్రమంలో పొలార్డ్ ఒక రన్ పూర్తి చేశాడు. కానీ, ఆ పరుగు జట్టు ఖాతాలోకి వెళ్లలేదు.
ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్ ఔటిచ్చిన తర్వాత ఆ బంతికి చేసిన పరుగులు లెక్కలోకి రాకపోవడమే అందుకు కారణం. కానీ, పొలార్డ్ రివ్యూ విజయవంతమైనా ఆ పరుగును కౌంట్ చేయలేదు. ఈ నిబంధనను మార్చాలని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఇది సరైన రూల్ కాదని.. దీన్ని తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందని ఐసీసీ లా మేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌ను కోరాడు ఆకాశ్ చోప్రా.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్‌పై 48 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది.