కోల్‌కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు బ్యాటింగ్ సరిగా చేయకపోగా కెప్టెన్‌గానూ ఘోరంగా విఫలమవుతున్నాడని అసహనానికి గురవుతున్నారు. ఆ జట్టు సారథ్య బాధ్యతలను వేరేవాళ్లకు అప్పగించాలని కోరుతున్నారు. దిల్లీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆఖర్లో కోల్‌కతాను గెలిపించడానికి బ్యాట్స్‌మెన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి విశ్వప్రయత్నం చేశారు. కానీ.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో కెప్టెన్ వైఫల్యం వల్లే కోల్‌కతా ఓడిపోయిందని, కార్తీక్ సారథ్యంలో జట్టు ముందుకు వెళ్లడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.
గంభీర్ నుంచి నేర్చుకున్నదేమిటి?
కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ చేసిన తప్పులే పునరావృతం చేస్తున్నాడు. బ్యాట్స్‌మన్‌గా.. కెప్టెన్‌గా ఆశించిన ఫలితాలు చూపించలేకపోతున్నాడు. జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌ను తమవైపు తిప్పగల ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. కారణం.. బ్యాటింగ్ ఆర్డర్‌లో సరైన ప్రణాళికలు లేకపోవడమే. ఇంతకుముందు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ తన దూకుడుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్‌లోనే కోల్‌కతా నాలుగో స్థానం చేరింది. తర్వాత రెండుసార్లు టైటిల్ విజేతగానూ నిలిచింది. మరి అలాంటి ఛాంపియన్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న కార్తీక్ మాత్రం గంభీర్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన పరిణితి చూపించడం లేదు. గంభీర్ సారథ్యంలో కోల్‌కతా విజయాల రేటు 56.48గా ఉండగా.. కార్తీక్ జట్టు పగ్గాలు అందుకున్నాక అది 51.52కు పడిపోయింది.
0..1..6 కార్తీక్ పరుగులివి..
కార్తీక్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దిల్లీపై 6(8బంతుల్లో), రాజస్థాన్‌పై 1(3బంతుల్లో), హైదరాబాద్‌పై 0(3బంతుల్లో) పరుగులు చేశాడు. ముంబయిపై 30(23బంతుల్లో) ఫరవాలేదనిపించినా.. కీలక సమయంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఇలా బ్యాట్స్‌మెన్‌గానూ ముందుండి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన కెప్టెన్ తడబడుతున్నాడు. జట్టుకు అండగా ఉండాల్సిన సమయంలో అనవసర షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరుతున్నాడు. జట్టులో ఉన్న యువ క్రికెటర్‌లు చూపించిన సంయమనం కూడా పాటించకలేక బ్యాట్స్‌మన్‌గా తేలిపోతున్నాడు.
కెప్టెన్‌గానూ వైఫల్యం..
మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్లో కార్తీక్ తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలివ్వడం లేదు. అతని తర్వాత వచ్చే మోర్గాన్ గత మూడు మ్యాచుల్లోనూ 42*(29), 34*(23), 44(18) మెరుపులు మెరిపించాడు. అయినా.. మోర్గాన్‌ను ముందు పంపించకుండా.. ఆఖర్లో బ్యాటింగ్ ఇవ్వడంతో అతడిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. గత మ్యాచ్‌లోనూ మోర్గాన్ ముందే వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. మరో ఎండ్‌లో చివరి వరకూ పోరాటం చేసిన రాహుల్ త్రిపాఠి సైతం ఒకప్పటి ఓపెనర్ బ్యాట్స్‌మన్. భారీ సిక్సర్లు బాదగల నైపుణ్యం ఉన్న ఆటగాడు. అయితే.. త్రిపాఠిని ఇప్పటివరకూ స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా గుర్తించకపోవడం కార్తీక్‌లో స్పష్టంగా కనిపిస్తున్న లోపం.
ఇకనైనా.. కార్తీక్‌ను కేవలం వికెట్ కీపింగ్‌కు మాత్రమే పరిమితం చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ అందించిన మోర్గాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలంటున్నారు. బ్యాటింగ్‌తో పాటూ జట్టును ముందుండి నడిపించడంలోనూ మోర్గాన్ అనుభవం జట్టుకు కలిసొచ్చే అంశమే. మరి.. ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.